విజయవాడలో రోడ్డెక్కిన జనసేన : పేదోళ్ల ఇళ్లకు 'రిజిస్ట్రేషన్' డిమాండ్
విజయవాడ : మొన్నటి కాకినాడ సభ తర్వాత.. ఇక పవన్ పొలిటికల్ తెర మీద దర్శనమిచ్చేది మళ్లీ ఎప్పుడో..! అంటూ చాలామంది ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఎప్పుడూ అనూహ్య నిర్ణయాలే తీసుకునే జనసేన అధినేత పవన్.. ఈసారి కూడా అనూహ్యంగానే అనంత సభను ప్లాన్ చేసేశారు. ఏదేమైనా పవన్ పొలిటికల్ యాక్టివిటీ.. అటు జనసేన అభిమానులను కూడా యాక్టివ్ చేస్తోన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజాగా విజయవాడలోని పేదల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు నగరంలోని అలంకార్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. నగర పరిధిలోని కొండ ప్రాంతం మరియు పట్టా భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు.

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి పోతిన మహేష్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది. పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ లేకపోవడంతో.. బ్యాంకులు వారికి రుణాలు మంజూరు చేయడం లేదని, దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని పోతిన మహేశ్ తెలిపారు. నామమాత్రపు ధరలతో పేదలందరికి రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పిస్తే.. అది వారి అభివృద్ధికి తోడ్పడినట్లవుతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications