జనసేన ఎమ్మెల్యేల రహస్య భేటీ - ఇలా అయితే కష్టం, తేల్చండి..!?
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. ముగ్గురు మంత్రులు జనసేన నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా గా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు త్వరలో మంత్రి కానున్నారు. ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు.. తమ మాట చెల్లుబాటు పైనే ప్రధానంగా చర్చ చేసినట్లు సమాచారం. కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రహస్య భేటీలో
ఇటీవలే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. ఇటు, జనసేన ఎమ్మెల్యేలు విజయవాడలోని ఒక హోటల్ లో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి నాదెండ్ల మనో హర్ సైతం హాజరయ్యారని సమాచారం. మొత్తం 21 మంది ఎమ్మెల్యేల్లో మంత్రులుగా ఉన్న ముగ్గురు మినహా మిగిలిన 18 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వివరించారు. అధికారులు తమ మాట వినడం లేదన్న ధోరణిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పనికి జనసేన మంత్రుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని మనోహర్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇంఛార్జ్ ల మాటకే ప్రాధాన్యత దక్కుతుందని వాపోయినట్లు చెబుతున్నారు.
ఎందుకీ పరిస్థితి
డిప్యూటీ సీఎంగా పవన్, మంత్రులుగా ఉన్న మనోహర్ .. దుర్గేశ్ నియోజకవర్గాల్లో మాత్రం వారి మాట చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చారు. తమ నియోజకవర్గాల్లో అధికారులకు ఏం చెప్పినా పట్టించుకోవటం లేదని మోర పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం. తాము నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నా.. పనులు అవ్వటం కోసం ముగ్గురు మంత్రుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే రకంగా భవిష్యత్ లోనూ కొనసాగితే నియోజకవర్గంలో తమకు విలువ లేకుండా పోతుందని.. పరిస్థితుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

పవన్ జోక్యం చేసుకోవాలి
ఇదే సమయంలో పార్టీ పరిస్థితులు.. ప్రజలతో మమేకం కావాల్సిన అంశాల పైన ప్రస్తావనకు వచ్చి నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారి మాటే అమలు చేస్తున్నారని.. తమ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇంచార్జ్ ల మాటే చెల్లుబాటు కావటంతో తాము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని.. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు డిప్యూటీ సీఎం పవన్ కు తెలిసేలా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారని చెబుతున్నారు. కాగా, మీటింగ్ లో జరిగిన అంశాల పైన ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఉందనే వాదన ఉంది. కాగా, ఈ సమావేశం పైన జనసేన ఎమ్మెల్యేలు ఓపెన్ గా స్పందించటానికి నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications