ఏపీతో జపాన్ అనుసంధానం-చంద్రబాబు పెట్టుబడుల వేట..!
ఏపీలో జపాన్ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ విజయవాడలో ఓ సదస్సు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌తో జపాన్ అనుసంధానం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే భారత్‌లో జపాన్ రాయబారి ఓనో కొయిచ్చి కూడా పాల్గొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పీపుల్ టూ పీపుల్ ఎక్చేంజ్ అండ్ ఎడ్యుకేషన్‌పై ఈ సదస్సు జరిగింది.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జపాన్ కంపెనీల ప్రతినిధులను మంత్రి టి.జి భరత్ ఈ సందర్భంగా కోరారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైన ప్రాంతమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు.

ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళుతున్నామని మంత్రి టీజీ భరత్ జపాన్ ప్రతినిధులకు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 9 నెలల్లోనే ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని, ..ఇప్పుడు సీబీఎన్ బ్రాండ్‌తో పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నామని మంత్రి భరత్ తెలిపారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో మెకానిజంను ఏపీలో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలు సద్వినియోగం చేసుకొని పెట్టుబడులు పెట్టాలని ఆయన జపాన్ పెట్టుబడిదారుల్ని కోరారు.












Click it and Unblock the Notifications