జగన్ పాలనపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మెజార్టీ సర్వేలు అధికార వైసీపీనే గెలుస్తాయని తేల్చి చెప్పాయి. సర్వేలు ఎలా ఉన్నా తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల గురించి సీనియర్ హీరోయిన్ జయప్రద స్పందించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద .. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో పురందేశ్వరి పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ఆమె పిలిస్తే.. వచ్చి ప్రచారం చేస్తానని అన్నారు. ఏ బాధ్యత అప్పగించినా పూర్తి చేస్తానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్టు తెలిపారు. జగన్ పాలన బాగుందా? అన్న ప్రశ్నకు జయప్రద నవ్వుతూ కొద్ది అడుగులు ముందుకు వేశారు. అనంతరం.. ఆమె మాట్లాడుతూ.. బాగుందో లేదో రిజల్ట్ వచ్చాక మీకే తెలుస్తుందిలే! అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

ఆమె గతంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున ప్రచారం చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని జయప్రద ప్రకటించారు. జయప్రద మాట్లాడుతూ..ప్రస్తుతం నేను ఉత్తర ప్రదేశ్ లో ఉంటున్నా... ఎప్పటికీ తెలుగు బిడ్డనే.ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలని ఉంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా , రాజధాని లేవు. వాటికోసం పోరాడతాను.ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో.. శాశ్వత రాజధాని కడతారో వారికే నా మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు.
కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అని జయప్రద చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో ప్రచారానికి పిలిస్తేనే వెళ్తానని..పిలవని పేరంటానికి వెళ్లనని ఈ సీనియర్ నటి స్పష్టం చేశారు. గతంలో టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న జయప్రద ఆ తరువాత జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ జనతా పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేసిన జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications