ఏడడుగుల లోతుకు పూడ్చేశారు, బాధేస్తోంది: జెసి ఫైర్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పైన ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మంత్రులు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి అధిష్టానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీని తమ పార్టీ అధిష్టానం సీమాంధ్రలో ఏడడుగుల లోతుకు పూడ్చి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదిష్టానం తీరు మూగ, చెవిడి, గుడ్డిలా తయారయిందన్నారు. ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేదన్నారు.
కాంగ్రెసును వీడాలంటే తనకు చాలా బాధగా ఉందన్నారు. ఆ పార్టీతో తనకు ఏడు తరాల అనుబంధముందన్నారు. అసెంబ్లీకి తీర్మానం కూడా రాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోందన్నారు. ఏ సమస్య పరిష్కారానికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పెద్ద మనిషిగా ఉంటారో చెప్పాలని ఎద్దేవా చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడి వెనుక అసాంఘిక శక్తులు ఉన్నారని, వ్యక్తిగత కక్షలతో కూడా ఈ దాడులు జరుగుతుండవచ్చునన్నారు. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించుకోవడం మంచిదన్నారు.

పొంతన లేదు: గంటా
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై దాడులు సరికాదని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఆయన ఆస్తులపై దాడిని కాంగ్రెసు పార్టీపై దాడిగానే తాము భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిలా బొత్స సమైక్యవాదం వినిపించడం లేదని దాడులు చేయడమేమిటన్నారు. విభజన విషయంలో అధిష్టానం చేస్తున్న దానికి చెబుతున్న దానికి పొంతన లేదన్నారు.
సమైక్య ముసుగులోనే బొత్స ఆస్తులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విభజన విషయంలో అధిష్టానం తీరు గందరగోళంగా ఉందని ఆక్షేపించారు. అధిష్టానం తీరు అయోమయంగా, గందరగోళంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి ఆంటోని కమిటీ రాకుండానే ముగించారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయాని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతుండగా, ప్రభుత్వ నిర్ణయాలని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications