పవన్ కళ్యాణ్! వెంట్రుకతో సమానం, మోడీ ఉన్నంత కాలం రాదు: జేసీ సంచలనం
అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, తనకు ఎంపీ పదవి వెంట్రుకతో సమానమని ఆయన అన్నారు.
నోరుందని పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ రోడ్డెక్కాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్‌గా మాట్లాడాలని హితవు పలికారు.
హోదా విషయమై పవన్ కళ్యాణ్ వెనుక నడిచేందుకు తాము సిద్దమని, అందుకోసం తాము ఏం చేసేందుకైనా సిద్ధమన్నారు. ఆరు కోట్ల మంది అడ్డుకున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందని, ఇవాళ ఉన్నవి చెవిటి, మూగ ప్రభుత్వాలని పవన్ కళ్యాణ్‌కు తెలియదా అన్నారు.

ప్రజాభిప్రాయంపై గౌరవంలేని ప్రభుత్వాలు అన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఎంపీలందరూ రాజీనామా చేసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. తాము వ్యాపారులం కాబట్టే రూ.పది ఖర్చు చేసి గెలుస్తున్నామని చెప్పారు.
పవన్ కళ్యాణ్‌కు పార్లమెంటరీ వ్యవస్థ ఏమిటో తెలియదన్నారు. ఏం చేసినా ప్రత్యేక హోదా అసాధ్యమని చెప్పారు. హోదా కోసం రాజీనామాకైనా సిద్ధమని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పారు. మోడీకి జగన్మాత ఆదేశిస్తే వస్తుందని చురకలు అంటించారు. కాలు పైకెత్తి, తలకింద తపస్సు చేసినా హోదా రాదన్నారు. ఆర్థిక సాయం మాత్రం వస్తుందన్నారు.
అభిమాని చనిపోయినందుకు..
అభిమాని చనిపోయినందుకు వారికి సందేశం ఇవ్వడం వరకు పవన్ కళ్యాణ్ తీరు బాగానే ఉందని చెప్పారు. కానీ రాజకీయాల విషయానికి వస్తే అతనికి అనుభవం, వయస్సు తక్కువ అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి తర్వాత బాగా క్రేజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన బహిరంగ సభలో మనోవేదనతో మాట్లాడారన్నారు.
చంద్రబాబు అవమానాలు భరిస్తున్నారు
కేంద్రంలో ఎంపీల పరిస్థితి కరివేపాకులా మారిందని జేసీ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు అవమానాలు భరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తెలివైన వ్యక్తి కాబట్టి కేంద్రం హోదా పై స్పందించకున్నా సమయంనం పాటిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బాబు చూస్తున్నారన్నారు.
బజార్లకు వచ్చి సామాన్యులను పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టవద్దన్నారు. పవన్ ఊహాలోకంలో విహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హోదా తెస్తానంటే ఎంపీలు, కేంద్రమంత్రులతో కలిసి ఆయన వెంట నడుస్తామన్నారు.
రాజీనామాలతో హోదా వస్తుందంటే ఇప్పుడే సిద్ధమన్నారు. హోదా సెంటిమెంటుతో కూడిన అంశమని చెప్పారు. ప్రధాని తలుచుకుంటే హోదా రెండు నిమిషాల పని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే బీజేపీకి కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు.
చంద్రబాబుకో నమస్కారం పెట్టి
హోదా సాధిస్తానని పవన్ కళ్యాణ్ చెప్తే కనుక మా చంద్రబాబుకు ఒక నమస్కారం పెట్టి, ఇన్నాళ్లూ మమ్మల్ని బాగా చూసుకున్నారని, హోదా సాధిస్తానని ఆ మహానుభావుడు చెప్పాడు కను.. ఆయన వెనుక వెళుతున్నామని ముఖ్యమంత్రితో చెబుతానని జేసీ అన్నారు.
'పవన్ గారూ, రండి మీకు చేతనైతే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయండి. లీడ్ తీసుకో, వీ విల్ అప్రిసియేట్ యు. ఏ పార్టీకి చెందిన వారైనా నీ వెంట రావడానికి సిద్దంగా ఉన్నాం. పవన్ ఏదో రెండు రోజులు ప్రజల ముందుకు వచ్చి జిందాబాద్ అని ఆయన అనిపించుకుని, మమ్మల్ని మురాదాబాద్ అనిపించడం బాగోలేదు. ప్రత్యేక హోదా విషయమై, ఎంపీలందరూ రాజీనామా చేసినా ప్రధాని మోడీ వెంట్రుక కూడా తెగదు' అన్నారు.
ప్రధాని ఇంటి ముందు మాట్లాడాలి: అవంతి, అయ్యన్న
ప్రత్యేక హోదా విషయమై తాము పవన్ కళ్యాణ్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమని ఎంపీలు అవంతి శ్రీనివాస్, మంత్రి అయ్యన్న పాత్రుడు చెప్పారు. వ్యవస్థను కించపరిచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. తమకు ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని ఇంటి ముందు మాట్లాడాలన్నారు. హోదా, ప్యాకేజీ కోసం పవన్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమని చెప్పారు.
జనసేన ప్రకటన
జనసేన పార్టీకి అధికార ప్రతినిధులు ఎవరూ లేరని, అధికార ప్రతినిధులుగా వస్తున్న ప్రకటనతో సంబంధం లేదని ఆ పార్టీ ఆదివారం నాడు స్పష్టం చేసింది. జనసేన సంస్థాగతంగా పూ ర్తిగా రూపుదిద్దుకోలేదని చెప్పారు. పార్టీ ప్రకటనలను లెటర్ హెడ్ పైన అధికార ముద్రతో విడుదల చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications