సీమ ఉద్యమం ఎందుకు?, వారంతా రెజెక్ట్‌డ్ పీపుల్: రాయలతెలంగాణపై జెసి సంచలనం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టయితే సీమకు ఇన్ని కష్టాలు వచ్చేవికావని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని దివాకర్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే.
అయితే, ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ అంటున్న వారంతా గతంలో ప్రజలు తిరస్కరించిన నేతలేనని అన్నారు. వాళ్లతో అయ్యేదేమి లేదని అన్నారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించాలని ఉన్నా.. వర్షాలు కురవక సాధ్యం కాలేదని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు.
ఏపి ముఖ్యమంత్రికి అంతా తెలుసని, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆయన అంతా కరెక్టుగా చేస్తారని ఆయన తెలిపారు. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
టిడిపి, బిజెపి పరస్పర విమర్శలు మంచిది కాదని ఆయన హితవు పలికారు. మోడీ, చంద్రబాబుల మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని జెసి అన్నారు. ఏపిలో బిజెపికి క్యాడర్ లేదని, ఎక్కువ బలం ఉందని బిజెపి ఊహించుకుంటోందని జెసి అన్నారు. ధరల పెరుగుదలే బీహార్‌లో మోడీ కొంపముంచిందని దివాకర్‌రెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదన్ని విషయం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే వస్తుందని దివాకర్ రెడ్డి చెప్పారు.
బీహార్‌లో ఫలితాలు ఫలితాలు మోడీకి, ఇతర రాష్ట్రాల సీఎంలకు గుణపాఠమని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ప్యాకేజీతో, విభజన వాదంతో గెలిచేస్తామని భావించిన వారికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు ఎవరికీ వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని అన్నారు. ప్రజలేమన్నా వెర్రోళ్లా? రాజకీయ నాయకులు ఏది చెబితే అది నమ్మేయడానికి? అని ఆయన పేర్కొన్నారు.
ప్రజల అంచానాను అందుకోలేకుంటూ బీహార్ ఫలితాలు వస్తాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్నారు. ప్రజలకు అవగాహన వచ్చిందని ఎవరిని ఎన్నుకోవాలో వారికి బాగా తెలుసని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపై లేనిపోని మాటలు చెప్పకుండా నిజాయతీగా ఉండాలని ఆయన సూచించారు. నితీష్ కుమార్, లాలూను బీహార్ ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు.
మోసగించడంలో దిట్టలు: మోడీ, బాబుపై శైలజానాథ్
ప్రధాని మోడీ, ఏపి సిఎం చంద్రబాబుల జోడీ ప్రజలను మోసగించడంలో దిట్టలని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి సత్యాగ్రహాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ప్రాంతాల మద్య విభేదాలు పెరుగుతున్నాయన్నారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 24వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా గురించి ఏమీ అడగవద్దన్న షరతుతోనే ప్రధాని అమరావతి శంకుస్థాపనకి వచ్చారని శైలజానాథ్ వెల్లడించారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేష్ ఆర్డీఓ దగ్గరనుంచి రాళ్లు కొట్టుకునే వారిని కూడా వదలకుండా వసూళ్లు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు రామచంద్రయ్య ఆరోపించారు. అహంకారం వదులుకోకుంటే ఏమవుతుందో బీహార్ ప్రజలు తెలియజెప్పారని రామచంద్రయ్య హితవుపలికారు












Click it and Unblock the Notifications