ధోనీ, కోహ్లీ సన్నిహితుడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు..!!
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం ఎంపికకు కసరత్తు జరుగుతోంది. వైసీపీ హాయంలో ఏసీఏ కార్యవర్గం కూర్పు పైన రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏసీఏకూ నూతన కార్యవర్గ ఏర్పాటు పైన కసరత్తు జరుగుతోంది. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు, ప్రస్తుత అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేసేసింది.
ఏసీఏ ఎన్నికల నోటిఫికేషన్
ఏసీఏ కొత్త కార్యవర్గం ఎంపిక పైన కొద్ది రోజులుగా కూటమిలోని ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇక, ఈ నెల 4న విజయవాడలో జరిగే ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఎలాంటి చర్యలు తీసుకోనుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదేరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయాల సమీకరణాల నేపథ్యంలో అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి సహా అపెక్స్ కౌన్సిల్ మొత్తం గతనెల 21న రాజీనామా చేసింది.

కొత్త కార్యవర్గం
ఈ రాజీనామాలను ఎస్‌జీఎంలో ఆమోదింపజేసుకుని, బాధ్యతల నుంచి పూర్తిగా పక్కకు తొలగాలని నిర్ణయించారు. దీనికి ముందే తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపు, తమ అనుకూల ఏసీఏ సిబ్బందికి భారీగా జీతాల పెంపు, కొత్త ఉద్యోగుల నియామకాలను చడీచప్పుడు లేకుండా కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి పూర్తి చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమి నాయకులు... ఏసీఏ ప్రక్షాళన బాధ్యతలు చూస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మంత్రాంగం సాగిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అల్లుడితో పాటు, తూర్పు గోదావరికి చెందిన ఓ నాయకుడు కూడా ఏసీఏ పీఠంపై కూర్చోవాలని బలంగా పావులు కదుపుతున్నారు.

పీఠం దక్కేదెవరికి
మనీలాండరింగ్ కేసులో ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా నాయకుడు గోపీనాథ్ రెడ్డికి చెందిన ఓ క్లబ్ నుంచే పోటీపడనున్నట్టు సమాచారం. క్రికెట్ తెలిసిన వారికి ఏసీఏ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్, ఏసీఏలో గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్, ఆంధ్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు, బీసీసీఐలో మంచి పరిచయాలు, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలున్న జేసీ పవన్ రెడ్డి వంటి వారికి బాధ్యల పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీంతో, పవన్ రెడ్డికే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications