రాజధాని అమరావతిలో జేఈఓ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో..
రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నూతన శోభను సంతరించుకుంటోంది. ఈ ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటోంది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులన్నీ ముగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆలయ విస్తరణ, ఆధునీకరణ కోసం టీటీడీ ఇదివరకే 260 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.
నిజానికి ఈ ఆలయ పనులు 2028 ఉగాది నాటికి పూర్తి చేయాలని మొదట్లో టీటీడీ భావించింది. అంతకంటే ముందే.. అంటే ఈ సెప్టెంబర్ లో తిరుమలలో నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికే ప్రధాన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని ప్రతిపాదించింది. దీంతో విస్తరణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కూడా పనులు చకచకా సాగుతున్నాయి. టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ శరత్.. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.

అర్ధరాత్రి వేళల్లో ఆలయ నిర్మాణ స్థలాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆలయ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకుంటోన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టినందున అదనపు కార్మికులను నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఈ ఆలయాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉంది టీటీడీ.
ఈ నేపథ్యంలో వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయం రెండో ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.
పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని శరత్.. ఆలయ అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. లడ్డూ విక్రయ కేంద్రం, అన్నప్రసాద భవనం, విశ్రాంతి గదులు, టీటీడీ అడ్మిన్ ఆఫీస్, ఇతర కాటేజీలు, ఆడిటోరియం వంటి నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.














Click it and Unblock the Notifications