నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక
తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించే భక్తులకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయాల ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది.. నేటి నుంచి అమలులోకి వచ్చింది. హిందూ ధార్మిక, దేవాదాయ శాఖ ఈ మేరకు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఆలయాల పవిత్రతను కాపాడటానికి, తోటి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా దైవదర్శనం చేసుకునేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఆదేశాల ప్రకారం.. ఆలయాల లోపల గర్భగుడి లేదా ఇతర ప్రాంతాలలో దేవతామూర్తుల విగ్రహాలను ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం పూర్తిగా నిషిద్ధం. సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆలయాల్లో రీల్స్ చేయడం, సెల్ఫీలు దిగడం వంటి పనులపై కఠినమైన ఆంక్షలు విధించారు. సాధారణ భక్తులకు మాత్రమే కాకుండా వీఐపీలు, సెలెబ్రెటీలకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్లు కూడా ఆలయాలను సందర్శించినప్పుడు కూడా లోపల ఫొటోలు, వీడియోలు తీయడానికి, సెల్ఫీ దిగడానికి అనుమతి ఉండదు.

ఆలయాల ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద భక్తుల మొబైల్ ఫోన్లను సురక్షితంగా భద్రపరిచడానికి ప్రత్యేక లాకర్, మొబైల్ స్టోరేజ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు తమ ఫోన్లను ఇక్కడ డిపాజిట్ చేసి దైవదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి మొబైల్ ఫోన్‌కు అయిదు రూపాయల చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లాకర్ నిర్వహణలో పారదర్శకత కోసం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా డిజిటల్ రిసిప్ట్ భక్తులకు అందజేస్తారు.
మధురై బెంచ్ 2022 డిసెంబర్ లో న ఇచ్చిన తీర్పు ఆధారంగా దేవాదాయ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో కూడా ఆలయాల లోపలికి మొబైల్ ఫోన్లను నిషేధించాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. కొంతమంది భక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆలయాల లోపల ఫోన్లు వాడుతూ వీడియోలు తీయడం, రీల్స్ చేయడం వంటి పనుల వల్ల ఆలయాలలోని ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ తాజా నిబంధనలపై భక్తులలో ముందస్తుగా అవగాహన కల్పించేలా ఆలయాల వెలుపల, ప్రధాన రహదారుల వద్ద స్పష్టమైన సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రవేశ మార్గాల వద్ద మైకుల ద్వారా నిరంతరం ఈ నిబంధనల గురించి ప్రకటనలు చేయనున్నారు. ఫోన్ల నిషేధమే కాకుండా, దేవాలయాల పవిత్రమైన నియమాలను భక్తులందరూ పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవోలకు ప్రభుత్వం సూచించింది.












Click it and Unblock the Notifications