ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై మళ్లీ వడ్డన- 5 కిలోలపైనా భారం
దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 9.50 పైసల మేర పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఎలాంటి అదనపు భారం పడలేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ధరల వివరాల ప్రకారం, ఈ పెంపు వాణిజ్య పరమైన ఎల్‌పీజీ వినియోగానికి మాత్రమే పరిమితమైంది. అయిదు కిలోల నాన్-డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. నిన్నటివరకు 762 రూపాయలు ఉన్న అయిదు కిలోల నాన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర ఇప్పుడు 764 రూపాయలకు చేరుకుంది. అయిదు కిలోల డొమెస్టిక్ సిలిండర్లు, ఎక్స్‌ట్రాలైట్ గ్యాస్ ధరల జోలికి వెళ్లలేదు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

ఈ పెంపుతో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,738 నుంచి రూ. 2,747.50కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 2,691.50 నుంచి రూ. 2,701కు పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 10.50 పైసల మేర పెరిగింది. ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,916.50కు చేరుకుంది.
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, ఇతర చిరు క్యాంటీన్లు.. ఈ 19 కిలోల వాణిజ్య సిలిండర్లపైనే ఆధారపడతాయి. తాజా పెంపు పెద్ద వడ్డన కాకపోయినప్పటికీ.. ఇప్పటికే రేట్లు 2,800 రూపాయలను దాటిన నేపథ్యంలో అవి భారంగానే మారాయి. చిన్న చిన్న హోటళ్ల నిర్వహణ వ్యయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కిందటి నెలలో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను ఏకంగా రూ. 200 వరకు తగ్గించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో డొమెస్టిక్ విమాన టిక్కెట్ల ఛార్జీల మోత తప్పేలా లేదు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు వరుసగా రెండో నెలలోనూ పెరిగాయి. ఏటీఎఫ్ రేటును లీటరుకు రూ. 6.28 మేర పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీంతో లీటరు ఏటీఎఫ్ ధర రూ. 115 నుండి రూ. 121.28 కి చేరింది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వచ్చింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చులే సింహభాగం. దాదాపు 40 శాతం వరకు వీటి వ్యయాలే ఉంటాయి.
ఈ అదనపు భారాన్ని ప్రయాణికులపైనే మోపుతాయి ఆయా సంస్థలన్నీ కూడా. ఈ నేపథ్యంలో పండుగల సీజన్‌లో టిక్కెట్ల ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 1న కూడా ఏటీఎఫ్ ధరను లీటరుకు రూ. 5 మేర పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలలో వచ్చే మార్పులు, స్థానిక పన్నుల విధింపు ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతినెలా ఒకటో తేదీన ఈ ధరలలో మార్పులు చేస్తుంటాయి.












Click it and Unblock the Notifications