ఇంట్లోకి పాములను ఇట్టే ఆకర్షించే వస్తువులు, పరిసరాలు
సాధారణంగా ఇళ్లలోకి పాములు రాకుండా ఉండేందుకు చాలామంది గుమ్మాలు, తలుపుల కింద ఉండే ఖాళీ ప్రదేశాలు, డ్రైనేజీ పైపులు వంటి మార్గాలపైనే దృష్టి పెడుతుంటారు. మనకు ఎలాంటి హాని చేయవని భావించే పరిసరాలు లేదా వస్తువులు, మొక్కులు సైతం పాములు ఇంట్లోకి చేరేందుకు ప్రధాన కారణమవుతుంటాయనేది చాలామందికి తెలియదు. ఆహ్లాదాన్నిచ్చే రకరకాల అలంకరణలు, మన రోజువారీ అలవాట్లు కూడా పాములకు అనుకూల ఆవాసాలుగా ఎలా మారుతున్నాయంటే నమ్మశక్యం కాదు.
ఇంటి ఆవరణలో గానీ, బాల్కనీలో గానీ పెంచుకునే మొక్కలు, గార్డెన్ తరహా వాతావరణం, చిన్న, చిన్న ఫౌంటెన్లు, కుండీల కింద నిలిచే నీరు కూడా పాములను ఆకర్షిస్తాయి. ఈ తేమతో కూడిన ప్రాంతాలలో కప్పలు, కీటకాలు ఎక్కువగా చేరుతాయి. ఇది పాములకు ఆహార వనరు. ఇలా నీరు, ఆహారం ఒకే చోట లభించే ప్రదేశాలను పాములు తమ నివాస స్థావరంగా మలచుకునే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు లేదా మొక్కలకు నీరు పోస్తున్నప్పుడు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా గార్డెన్ ను పొడిగా ఉంచడం ఎంతో అవసరం.

అందంగా అల్లుకుపోయే తీగ మొక్కలు ఇళ్లకు అందాన్ని ఇస్తాయి. ఇవి కాంపౌండ్ వాల్ వెంబడి దట్టంగా పెరిగినప్పుడు పాములు వాటిని ఆసరగా, ఆవాసంగా చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇళ్లలో గోనె సంచులు, పాత కార్డ్‌బోర్డ్ డబ్బాలు, పెంపుడు జంతువులకు పెట్టి వదిలేసిన ఆహార గిన్నెలు ఎలుకలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వాటితో పాటు పాములు కూడా ఇంటి పరిసరాల్లోకి చొరబడటానికి దారి తీస్తాయి.
పక్షుల కోసం గింజలు చల్లడం, వాటి దాహం తీర్చడం వంటి పనులు చేస్తుంటాం. ఇది చాలా మంచి అలవాటు కూడా. ఈ గింజలు ఎలుకలను ఆకర్షిస్తాయి. ఎలుకలు ఎక్కడ ఉంటే వాటిని వేటాడటానికి పాములు కూడా ఖచ్చితంగా అక్కడకు చేరుకుంటాయి. అంటే, మనం పక్షుల కోసం వేసే ఆహారం పరోక్షంగా పాములను ఆహ్వానించినట్టవుతుంది. అలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పక్షులను పెంచుకుంటున్నట్టయితే అవి పెట్టే గుడ్లు కూడా పాములను ఆకర్షిస్తుంటాయి.
వీటి నుంచి బయటపడడానికి తోటల పెంపకాన్ని గానీ, పక్షులకు ఆహారం పెట్టడాన్ని గానీ మానేయాల్సిన అవసరం లేదు. వాటిని అమర్చే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. పక్షుల గూళ్లు, నీటి పరికరాలను ఇంటి ప్రధాన ద్వారాలకు, కిటికీలకు వీలైనంత దూరంలో పెట్టాలి. గార్డెన్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, పెరిగిన తీగలను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి. ఇంటి ఆవరణలో గానీ, బాల్కనీల్లో గానీ గుబురు పొదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అవి పాములను ఇట్టే ఆకర్షిస్తాయి.
ఇంట్లో పాము కనిపించినట్లయితే, దానిని స్వయంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదు. అందుబాటులో ఉన్న స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలి. పొరపాటున పాము కాటుకు గురైతే, ఎటువంటి నాటు వైద్యాల జోలికి పోకుండా బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. సకాలంలో చికిత్స అందించాలి.













Click it and Unblock the Notifications