Kommineni Srinivasa Rao: ఎట్టకేలకు జైలు నుంచి కొమ్మినేని విడుదల..!
అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ సాగిన సాక్షి టీవీ డిబేట్ నిర్వహించిన వ్యవహారంలో అరెస్టైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ కేసులో అరెస్టు అయి రిమాండ్ పై ఉన్న ఆయన్ను విడుదల చేయాలంటూ గత వారమే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా సాంకేతిక కారణాలతో విడుదల ఆలస్యమైంది. దీంతో ఇవాళ సాయంత్రం ఆయన్ను గుంటూరు జైలు నుంచి విడుదల చేసారు.
అమరావతిపై వ్యాఖ్యల వ్యవహారంలో మరో జర్నలిస్ట్ కృష్ణంరాజును ఏ1గా చేర్చిన పోలీసులు, డిబేట్ నిర్వహిస్తూ ఆయన్ను అడ్డుకోలేదన్న కారణం చూపుతూ కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా చేర్చారు. ఈ కేసులో మంగళగిరి కోర్టు రిమాండ్ విధించడంతో గుంటుూరు జైలుకు ఆయన్ను తరలించారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొమ్మినేనికి ఊరట లభించింది. డిబేట్ నిర్వహించారన్న కారణంతో కొమ్మినేనిని అరెస్టు చేయడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది.

కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణం విడుదల చేయాలంటూ ఏపీ పోలీసుల్ని సుప్రీంకోర్టు గత శుక్రవారం ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులు అందేసరికి శనివారం కావడం, ఆదివారం సెలవు రోజు కావడంతో కొమ్మినేనిని జైలు నుంచి విడుదల చేయడం సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఇవాళ ఆయన లాయర్లు సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు అధికారుల్ని కలిసి విడుదల చేయాలని కోరడంతో కొమ్మినేని విడుదలయ్యారు. ఈ సందర్బంగా ఆయన భార్య స్వయంగా గుంటూరు జైలుకు వచ్చి ఆయన్ను తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications