భార్యనే అడగలేదు, రూ.10 ఇవ్వండి: జెపి, విలీనం పైనా
హైదరాబాద్: కొత్త రాజకీయం కోసం యువత, మహిళలు ముందుకు వస్తే అధికారం అనే ముళ్ల కిరీటాన్ని అందుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ శనివారం అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద లోక్‌సత్తా ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలోని యువత నాలుగంటే నాలుగు నెలల సమయాన్ని తనకు కేటాయిస్తే వారికి ఉజ్వలమైన భవిష్యత్తును అందజేస్తానన్నారు.
ఇప్పటి వరకు తమ అమ్మను కానీ తన భార్యను కానీ ఆకలి వేస్తోంది.. అన్నం పెట్టమని అడగలేదని, కానీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ లోక్‌సత్తా కోసం తమ ఆదాయంలో 10 శాతం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క చూపిస్తానని, ఇచ్చే డబ్బులకు పన్ను రాయితీ కూడా ఉంటుందన్నారు. 2014లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రం ఐక్యంగా ఉన్నా, విడిపోయినా రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు లోక్‌సత్తా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

ఏళ్ల తరబడి రాజకీయ నేతలు తమ తమ కుటుంబాలకు దోచిపెట్టడానికే కుల, మత, ప్రాంతం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. లక్షలాది మంది భవిష్యత్తు కోసం ఆలోచించే రాజకీయాలు కావాలని, ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైందని, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థే కొనసాగాలని ప్రజలు కోరుకుంటే లోక్‌సత్తా రాజకీయ అస్త్ర సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. తెలంగాణ విషయంలో అసెంబ్లీలో మేం చూపించిన పరిష్కారం తప్ప మరోదారిలేదన్నారు.
విలీనం ఉండదు: కటారి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి)లో లోక్‌సత్తాను విలీనం చేసే అవకాశం లేదని లోక్‌సత్తా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కటారి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఆప్‌లో లోక్‌సత్తాను విలీనం చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయంటూ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలపై కటారి స్పందించారు. ఆప్ ఢిల్లీలో పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి లోక్‌సత్తా బేషరతు మద్దతునిచ్చిందని, ఇక్కడ లోక్‌సత్తాకు ఆప్ మద్దతునివ్వాలని కోరుతున్నామన్నారు. అంతేగానీ ఆ పార్టీలో లోక్‌సత్తాను విలీనం చేసే అంశమే ఉత్పన్నం కాదన్నారు.












Click it and Unblock the Notifications