విభజన పాపంలో వైయస్: జేపీ, ఏం తీరని బాబుపై..!
గుంటూరు/విజయవాడ: లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిల పైన ఆదివారం గుంటూరులో మండిపడ్డారు. రాష్ట్ర విభజన పాపం వారిద్దరిదేనని ఆరోపించారు. అదే సమయంలో విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ప్రమాణ స్వీకారానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా అని చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో వాస్తవాలను విస్మరించి వేలు, లక్షల కోట్ల రూపాయలంటూ సున్నాలు పెట్టుకుంటూ వెళ్లడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదన్నారు. చంద్రబాబు ప్రాక్టికల్‌గా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్థిక లోటు విషయంలో గగ్గోలు పెడుతున్న బాబు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు, కార్యాలయ ఆధునికీకరణకు రూ,10 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. బాబు వంద రోజుల పాలనలో దూరదృష్టి లోపించిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది దేశంలో కొత్త వివాదానికి దారి తీస్తుందన్నారు. ప్రధానమంత్రి మన రాష్ట్రానికి చెందిన వాడైనా ఇది సాధ్యం కాదన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.య ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు చాలాకాలంగా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయని, ఇంత వరకు నెరవేరలేదన్నారు. పాలకులు దీని పైన డ్రామాలు ఆడటం సరికాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పారు.
త్వరలో తాను లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పారు. తన స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు అయిదుగురు సీనియర్ నేతలతో కమిటీని నియమిస్తామని తెలిపారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను ప్రజా ఉద్యమాల్లో భాగస్వామినవుతూ నిరంతరం జన బాహుళ్యానికి చేరువగానే ఉంటానని, రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications