కలిపి ఉంచలేం, బాధగానే ఉన్నా..: తెలంగాణపై జెపి
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ప్రాంతాలను కలిపి ఉంచలేమని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. బాధగానే ఉన్నా అది యథార్థమని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శనివారం ఆయన చర్చలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, అనివార్యమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయిన తర్వాత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యం కాదని ఆయన అన్నారు. బలవంతంగా కలిసి ఉండే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
తెలుగు మాట్లాడే ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని ఆయన అన్నారు. జెపి మాట్లాడుతున్నంత సేపు సభలో పూర్తి నిశబ్దం చోటు చేసుకుంది. అస్తిత్వం మంచిదే గానీ శ్రుతి మించిన అస్తిత్వం మంచిది కాదని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్లలో ఏ అంశంపై కూడా పూర్తి స్థాయి చర్చ జరగలేదని ఆయన అన్నారు. అస్తిత్వం అసూయగా, ద్వేషంగా మారకూడదని ఆయన అన్నారు. బలవంతంగా కలిసి ఉంచాలంటే అపారమైన జననష్టం జరుగుతుందని ఆయన అన్నారు.
అయితే, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. సమాజంలో ఉద్రిక్తతలు పెంచే విభజన సరి కాదని మొదటి ఎస్సార్సీ చెప్పిందని ఆయన అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఏకాభిప్రాయంతోనే విభజన జరగాలని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు దేశ ఐక్యతకు ప్రమాదంగా మారకూడదని ఆయన అన్నారు. పంజాబ్ విభజనపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత శాసనసభను రద్దు చేశారని ఆయన అన్నారు. పెడధోరణులతో వెళ్తే లాభం లేదని ఆయన అన్నారు. కొన్ని విభజనల విషయంలో శాసనసభల తీర్మానాలు వచ్చే దాకా ఆగారని ఆయన గుర్తు చేశారు.

పుట్టిన స్థలం కారణంగా ఏ విధమైన వివక్షలు ఉండకూదని రాజ్యాంగం చెబుతోందని ఆయన అన్నారు. హద్దులు గీసుకున్నంత మాత్రాన ఐక్యత చేడిపోదని ఆయన అన్నారు. విభజన తెలుగు ప్రజల సంస్కృతికి సంబంధించింది కాదని ఆయన అన్నారు. రాజకీయ విభజన మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితి విషయంలో తాను వందలాది రోజులు నిద్రపోలేదని ఆయన అన్నారు. రెండు రకాల సంస్కృతుల మధ్య సంఘర్షణ ప్రారంభమైందని ఆయన చెప్పారు.
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సమాజాల మధ్య అసమానతలున్నాయని, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణను, అప్పటికే ఆ వ్యవస్థ నుంచి బయటపడిన సీమాంధ్రను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. వాటి మధ్య ఐక్యతను సాధించే ప్రయత్నాలు జరగలేదని ఆయన అన్నారు. సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. అతి పెద్ద సమస్య కళ్ల ముందున్నప్పుడు లేనట్టుగా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు.
మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలని, మాట నిలబెట్టుకోలేదనే భావన తెలంగాణ ప్రజల్లో పేరుకుపోయిందని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం ఏడు అంశాలపై జరిగితే ఐదు అంశాలను అమలు చేసి, రెండు అంశాలను వదిలేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత రెండు సమాజాల మధ్య సంఘర్షణ చోటు చేసుకుందని, దాన్ని శాంతియుతంగా పరిష్కరించడంలో విఫలమయ్యామని ఆయన అన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో తెలంగాణకు 30 ఏళ్ల పాటు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. పార్టీలు చచ్చిపోయాయని, ప్రాంతాలు మాత్రమే మిగిలాయని ఆయన అన్నారు. ప్రతి అంశాన్నీ ప్రాంతీయ కోణంతోనే చూస్తున్నారని ఆయన అన్నారు.
నాలుగేళ్లుగా శాసనసభ సరిగా జరగడం లేదని, మంత్రివర్గం పనిచేయడం లేదని ఆయన అన్నారు. బలవంతంగా ఐక్యత సాధ్యం కానది ఆయన అన్నారు. ఒకే రాష్ట్రంగా ఉంచాలని అనుకుంటే అపారమైన జన నష్టం జరిగే ప్రమాదం ఉందని, అది బలప్రయోగంతో అణచివేసేది కాదని, ప్రజల మనస్సుల్లో నాటుకుపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం, అనివార్యమని, గతం జల సేత బంధనం నిష్ఫలమని ఆయన అన్నారు.
గతంలో జరిగిందేమిటని ఆలోచించడం వల్ల ఫలితం ఉండదని, భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆలోచించాలని ఆయన అన్నారు. పెడధోరణులతో వెళ్తే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఎలా చేయకూడదో అలా చేసి కేంద్రం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో హైదరాబద్ అంతర్భాగమే
తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమని ఆయన అన్నారు. రాజధాని కాబట్టే హైదరాబాద్‌పై ఎక్కువ నిధులు ఖర్చు చేశారని ఆయన చెప్పారు. రాయలసీమ నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఆ ప్రాంతం వెనకబడిందని ఆయన అన్నారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయం గురించి ఆయన వివరించారు. ఏయే ప్రాంతం ఏ విధంగా లోటు బడ్జెట్ ఉంటుందో చెప్పారు. రాష్ట్రానికి చెందిన అప్పుల గురించి కూడా మాట్లాడారు.
తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని ఆయన అన్నారు. ప్రాంతీయ మండళ్లను రద్దు చేయడం పొరపాటు అని ఆయన అన్నారు. అవసరమైతే రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రపతి ప్రతిపత్తి కల్పించాలని, దాని వల్ల రాయలసీమకు నిధులు ఎక్కువగా వస్తాయని ఆయన అన్నారు. పాలకుల వివక్ష వల్లనే రాయలసీమ వెనకబడిందని ఆయన అన్నారు. కేంద్ర నిధుల్లోనూ రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శించారని ఆయన అన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదా అని ఆయన అన్నారు. విభజన బిల్లు లోపభూయిష్టంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నికల ఎత్తుగడగా రాష్ట్ర విభజన విషయాన్ని పిచ్చిపిచ్చిగా చేశారని ఆయన అన్నారు. తెలంగాణ ఒక్కటి బాగుపడితే చాలా అని ఆయన అడిగారు. పదేళ్లలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలని ఆయన అన్నారు. విభజనతో నష్టపోతున్నవారికి సహకరించాలని ఆయన అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా అందరూ బాగుపడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications