సమయం, సందర్భం లేకుండా స్లోగన్లా: సీఎం నినాదాలపై వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లారిటీ ఇదీ
అమరావతి: రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు అనే చర్చ సాగుతోంది. ఇది కాస్తా పీక్స్ చేరుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి చేతుల్లో ఉన్న తెలుగుదేశం నాయకత్వంపై పార్టీ క్యాడర్‌లో విశ్వాసం సన్నగిల్లిందనే అభిప్రాయాలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు స్థానంలో పార్టీ పగ్గాలను అప్పగించాల్సి వస్తే..ప్రత్యామ్నాయం ఎవరనేది కూడా పార్టీ నేతలకే కాదు.. కిందిస్థాయి కార్యకర్త, ఓ సగటు టీడీపీ అభిమాని వరకు ఓ స్పష్టత ఉంది.

చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఎవరు?
టీడీపీ నాయకత్వం నారా కుటుంబం నుంచి మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకే వెళ్లాలనే అభిప్రాయం క్షేత్రస్థాయి టీడీపీ నేతల్లో ఎప్పట్నుంచో వ్యక్తమౌతోంది. కొద్దిరోజుల కిందటే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలోనూ వినిపించిన డిమాండ్ అది. ప్రముఖ నటుడు, నందమూరి కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్‌ను కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాక్షాత్తూ చంద్రబాబు ముందే వినిపించారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకుని రావాలనే డిమాండ్..తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి వరకూ వెళ్లిందనడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ మరొకటి ఉండకపోవచ్చు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో.. ఆయన అభిమానులే ఈ డిమాండ్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

నారా లోకేష్‌ను అంగీకరించలేకపోతున్నారా?
తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్‌ను క్యాడర్ అంగీకరించలేకపోతోందనేది బహిరంగ రహస్యమే. దీనికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్త కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారే తప్ప నారా లోకేష్‌కు పార్టీ సారథ్య బాధ్యతలను అప్పగించడానికి ఇష్టపడట్లేదు. నారా లోకేష్.. ప్రస్తుతం టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2019 నాటి ఎన్నికల్లో అమరావతికి గుండెకాయగా చెప్పుకొనే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరీ ఆయన ఓడిపోయారు. చంద్రబాబుతో పోల్చితే.. నారా లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు లేవని, ప్రత్యామ్నాయం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరేననేది ఓ సగటు టీడీపీ అభిమాని అభిప్రాయం.

జూనియర్ వైఖరేంటీ?
రాజకీయ అరంగేట్రం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా స్పందించట్లేదు. తన పరిమితులు, పరిధులకు లోబడే ఉంటున్నారు. పార్టీ నాయకత్వమే కావాలనుకుంటే.. అది ఆయన చేతుల్లో వచ్చి వాలుతుంది. దానికోసం ఆయన పెద్దగా శ్రమించాల్సిన పనీ ఉండకపోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఏ మాత్రం ఇష్ట పడట్లేదు. ఆ పేరు వింటేనే ఆయన చిరాకుపడిన సందర్భాలు ఉన్నాయి. తెల్లవారితే గురువారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్.. దీనికి మరోసారి ఉదాహరణగా నిలిచింది. సీఎం ఎన్టీఆర్ అంటూ నినదించిన అభిమానులకు ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో షూటింగ్ సమయలోనూ ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. దానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు.

సీఎం ఎన్టీఆర్ నినాదాలపై ఫ్యాన్స్ అసోసియేషన్ ఏం చెబుతోంది?
తెల్లవారితే గురువారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. సమయం, సందర్భం లేకుండా నినాదాలు చేయడం సరికాదని పేర్కొంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ మధ్య కొత్తగా సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు చేస్తున్నారని, దానికి ఇంకా సమయం ఉందని స్పష్టం చేసింది. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క అభిమానితో అదే నినాదాన్నిచేయిస్తామని వివరించింది. సమయం, సందర్భం లేకుండా అలాంటి నినాదాలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి నినాదాల వల్ల ఎన్టీఆర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. జై ఎన్టీఆర్ అనే నినాదానికి మించింది లేదని, అభిమానులు ఇది గమనించాలని విజ్ఞప్తి చేసింది. ఇకపై సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు చేయకుండా ఉంటేనే మంచిదని సూచించింది.












Click it and Unblock the Notifications