హరికృష్ణ ఔట్! బాలకృష్ణ రాకతోనే జూ.ఎన్టీఆర్ కార్నర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల ప్రాభవం తగ్గి, బాలకృష్ణ, నారా లోకేష్‌ల ప్రభావం పెరిగిందని అంటున్నారు. బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే వరకు టీడీపీలో ఎంతోకొంత హరికృష్ణ ప్రాధాన్యత కనిపించేది! అలకలు, అసంతృప్తులు ఉన్నప్పటికీ హరికృష్ణకు రాజకీయప్రాధాన్యత కనిపించేది. ఆయన అలక వహించినా లేక చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడినా అది వార్త అయ్యేది.
ఇక, 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత విభేదాలు రావడంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. అంతేకాదు, దీనిపై టీడీపీ నేతలు ఒకింత ఘాటుగానే స్పందించారు. తాము పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఎవరినీ ఆహ్వానించలేదని, పార్టీ కోసం వారే రావాలని చెప్పారు.
2009లో బాలకృష్ణ ప్రచారం కంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారమే హైలెట్‌గా నిలిచింది. అయితే, ఆ తర్వాత చంద్రబాబు వారసుడి విషయంలో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లతో విభేదాలు వచ్చాయి. హరి తన తనయుడి జూనియర్ ఎన్టీఆర్‌కు పగ్గాలు రావాలని ఆశపడ్డారు.

చంద్రబాబు, బాలకృష్ణలు మాత్రం అందుకు వ్యతిరేకం! చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్‌ను తన వారసుడిగా బయటకు చెప్పనప్పటికీ, ఆయన మనసులోని ఉద్దేశ్యమదేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే విభేదాలు పొడసూపాయి.
ఆ తర్వాత బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల ఊసే లేకుండా పోయిందని చెప్పవచ్చు. బాలయ్య రాజకీయాల్లోకి రాకుంటే.. అడపాదడపా హరికృష్ణ పేరు వినిపించేదేమో. కానీ బాలయ్య రాకతో ఆ అవకాశం లేకుండాపోయిందని అంటున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా పార్టీలో వినిపించడం లేదనే చెప్పవచ్చు. అదే సమయంలో నారా లోకేష్ పార్టీలో క్రియాశీలకంగా మారారు.
కాగా, ఇటీవల లయన్ ఆడియో వేదిక సందర్భంగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఎన్ని చిట్టెలుకలు వచ్చినా మా జోలికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు, మాడి మసైపోతారని అన్నారు. ఈ వ్యాఖ్యలు జూనియర్‌ను ఉద్దేశించేనా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications