శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ కోటా విడుదల, 24న రూ.300 కోటా టికెట్లు
తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

మార్చి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లు...
జూన్ 09 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
మార్చి 21న వర్చువల్ సేవల కోటా విడుదల
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 22న అంగప్రదక్షిణం టోకెన్లు..
జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా....
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా...
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల
తిరుమల, తిరుపతిలలో జూన్ నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు.
మర్చి 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 30న ఉగాది ఆస్థానం
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
మార్చి 30వ తారీఖున విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తారీఖున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
అదే విధంగా, మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని, సహస్ర దీపాలంకార సేవ మినహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

మార్చి 25, 30 తేదీలలో ప్రోటోకాల్ పరిధిలోని విఐపి లకు మాత్రమే విఇపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ కారణంగా మార్చి 24వ తారీఖున, అదే విధంగా మార్చి 29న విఐపి బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఎటువంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం జరగదు. ఈ అంశాలని భక్తలు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరారు.
తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరణ
తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 04వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వాల్ పోస్టర్లను టిటిడి ఈవో జె. శ్యామల రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ.. తిరుపతి శ్రీకోదండరామ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి నెల 27 నుంచి ఏఫ్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్నాయని, అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవములు ఏప్రిల్ 06 నుంచి ఏప్రిల్ 08 వరకు, తెప్పోత్సవములు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ అధికారులను ఈవో ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు.
అదేవిధంగా, వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుంచి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో బీ నాగరత్న, ఏఈవో రవి, ఆలయ ఇస్పెక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
టిటిడికి రూ.1.23 కోట్లు విరాళం
టిటిడికి చెందిన శ్రీ ఎస్వీ అన్నదానం, శ్రీ ఎస్వీ ప్రాణదానం, శ్రీ ఎస్వీ విద్యాదానం విభాగాలకు మంగళవారం రూ.1.23 కోట్లు విరాళం అందింది. కర్నాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ మేరకు డిడిలను తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
విరాళం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 1,01,11,111 విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు, రూ.11,11,111 విరాళాన్ని ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు, రూ. 11,11,111 విరాళాన్ని ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ కు సదరు సంస్థ ప్రతినిధులు డిడిలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించి సత్కరించారు.












Click it and Unblock the Notifications