తాత కోసం హైదరాబాద్ వచ్చి మళ్లీ వెళ్లిన తారక్
హైదరాబాద్ లో ఈనెల 20వ తేదీన నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడంపై ఇప్పటికీ పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. ఆ వేడులకు కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన టీడీ జనార్ధన్.. తాను స్వయంగా వెళ్లి తారక్ కు ఇన్విటేషన్ ఇచ్చానని, కాకపోతే చాలా కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నామని, దీనివల్ల రాలేకపోతున్నానని తారక్ చెప్పినట్లు జనార్దన్ వెల్లడించారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కంటే ప్రయాణం ముఖ్యమైందా? అంటూ జూనియర్ పై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది. అయితే తారక్ కోణంలో చూసినప్పుడు అందులో అతని తప్పేమీ లేదనిపిస్తోంది. ఎందుకంటే మే 20వ తేదీ జూనియర్ పుట్టినరోజు. ఆరోజు శతజయంతి వేడుకలు పెడతారని, తనను ఆహ్వానిస్తారని తారక్ అనుకోలేదు. పైగా 22 కుటుంబాలు కలిసి విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నారు. దాన్ని క్యాన్సిల్ చేసినా లేదంటే వాయిదా వేసినా వారంతా ఇబ్బంది పడేవారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు.

ఈ కారణమే కానీ తాతమీద తారక్ కు ప్రేమాభిమానాలు లేవని అనుకుంటామా? అలా అనుకోవడం కూడా సరికాదని అతడి మద్దతుదారులు అంటున్నారు. ఫారిన్ ట్రిప్ వెళ్లిన జూనియర్ తాత శతజయంతి కోసమని కుటుంబంతో సహా మళ్లీ హైదరాబాద్ వచ్చాడు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి అనంతరం ఇంటిదగ్గర వేరే కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదేరోజు సాయంత్రం మళ్లీ కుటుంబంతో కలిసి విమానాశ్రయానికి వెళ్లిపోయాడు. ఇది వేరే పర్యటనా? లేదంటే వచ్చిన ప్రాంతానికే మళ్లీ తిరిగి వెళ్లాడా? అనే విషయంలో స్పష్టత లేదుకానీ హైదరాబాద్ కు వచ్చింది మాత్రం తాతకు నివాళులర్పించడానికే అన్నది స్పష్టం. తాతపై ఉండే గౌరవాభిమానాల విషయంలో తారక్ ను ఎవ్వరూ శంకించలేరని అతడి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications