జగన్, చంద్రబాబుకు కేఏ పాల్ ఆఫర్- మా పార్టీలో చేరిపోండి-అన్నీ చూసుకుంటా-మీడియాకు థ్యాంక్స్
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హల్ చల్ చేస్తున్నారు. తన టూర్లలో భాగంగా విజయవాడ వచ్చిన పాల్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో.. ఇవాళ జగన్, చంద్రబాబు, పవన్, మోడీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయ పార్టీల అధినేతల్ని తన పార్టీలోకి వచ్చేయాలని పాల్ కోరారు. అదే సమయంలో ఏపీ మీడియా ధైర్యంగా స్పందిస్తోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

మీడియాకు దేవుడి ఆశీస్సులు
నేషనల్ మీడియా ఒత్తిళ్లకు లొంగి అమ్ముడుపోయిందని, కానీ తెలుగు మీడియా భయపడకుండా వార్తలు ఇస్తోందని పాల్ ప్రశంసించారు. అటువంటి టీవీ,పేపర్ యజమానులకు అభినందనలు తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించే మీడియా ఓనర్స్, ప్రతినిధులు కు దేవుని ఆశీస్సులు ఉండాలని కేఏ పాల్ ఆకాంక్షించారు. పాలకులే మీడియాను భయపెడుతున్నారంటూ ప్రభుత్వంపై కేఏ పాల్ విమర్శలు చేశారు. అదానీ లాంటి వాళ్లు మీడియాను కొనేస్తున్నాన్నారు. వినకపోతే చంపేవరకూ వెళుతున్నారని వ్యాఖ్యానించారు. అంతు చూస్తామని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారని కూడా పాల్ గుర్తుచేశారు. ప్రజా స్వామ్యం చనిపోతుందని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే జరిగిందన్నారు.లైవ్ లు ఇచ్చే ఛానల్స్ ను దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడన్నారు.

ఈవీఎంలతోనే బీజేపీకి 300 సీట్లు
న్యాయ వ్యవస్థపై కూడా నలుగురు న్యాయమూర్తులు బయటకి వచ్చి మాట్లాడారని కేఏ పాల్ గుర్తుచేసారు. కొంతమంది న్యాయ మూర్తులను బెదిరించే స్థాయికి వచ్చారని పాల్ విమర్శించారు. ఈవీఎంలు అయితే బీజేపీకి 300 సీట్లు తప్పవని చెప్పానని పాల్ తెలిపారు. అందుకే బ్యాలెట్ విధానం లో ఎన్నికలు పెట్టాలని కోరానన్నారు. ఈవీఎంలతో మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈవీఎం పద్ధతిలో ఓటింగ్ వద్దని, బ్యాలెట్ విధానమే ముద్దని పాల్ తెలిపారు.ప్రజా శాంతిపార్టీ లో చేరేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారని పాల్ పేర్కొన్నారు. కానీ మోడీ ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారన్నారు. మన దేశం, ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉందని పాల్ తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు దీనిపై స్పందించాలన్నారు. ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ఆరునెలల్లో దేశం నాశనం
బూత్ కమిటీ లు అయ్యే వరకు జిల్లాల్లో తిరుగుతానని పాల్ తెలిపారు. ఏపీకి ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉందని.. రూపాయి పుట్టే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ లో ఐదు కోట్ల అప్పుఉందని.. ఏం చేశారో తెలియదని పాల్ వ్యాఖ్యానించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమ గీతం పాడాలన్నారు.
ఈ దేశం మరో శ్రీలంక లాగా మారుతుందని, మోడీ 76లక్షల కోట్లు అప్పు చేశారని పాల్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలన్నారు. మోడీకి కూడా తాను కూడా లేఖలు రాశానని గుర్తుచేశారు. ఆరు నెలల్లోనే మన దేశం నాశనం కాబోతుందన్నారు. రోగికి డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన విధంగా.. ఈ దేశానికి మంచి మందు కావాలన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి గమనించి,సరిదిద్దాలని అందరికీ సూచించారు.మన దేశం, రాష్ట్రాలు ఆర్ధికంగా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.
దేశ, రాష్ట్ర నాయకులు ప్రభుత్వ సంపదను వారి నాయకులకు దోచి పెడుతున్నారని పాల్ ఆరోపించారు. అదానీ కి అన్యాయంగా ఆస్తులు అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో అంశాలను అమలు చేయలేదన్నారు.

ఏపీ నాశనానికి నలుగురే కారణం
ఏపీ నాశనం కావడానికి నలుగురు ప్రధాన కారణమని పాల్ తెలిపారు. జగన్, చంద్రబాబు, పవన్, మోడీలే ఆ నలుగురని పాల్ వెల్లడించారు. చంద్రబాబు, జగన్, తాను ముగ్గురం ఒకే వేదిక పై చర్చకు సిద్దమని పాల్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు కలలో కూడా గెలవరని, ఏపీలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో తెలంగాణ అవుతుందని చెప్పానని.. నిజం అయ్యిందని పాల్ గుర్తుచేశారు. అనేక మంది జాతీయ నాయకులు తనను కలుస్తున్నారని పాల్ తెలిపారు. కేసులతో వేధిస్తారని మోడీకి అందరూ భయపడుతున్నారన్నారు. దేశంలో మార్పు రావాలంటే... అందరూ తనకు మద్దతు ఇవ్వాలన్నారు.

జగన్, చంద్రబాబు, పవన్ కు పాల్ ఆఫర్ ఇదే
మాజీ సిఎం చంద్రబాబు తన సలహాలను పట్టించుకోలేదని పాల్ తెలిపారు. ఆయన ప్రధానమంత్రి కావడానికి, కొడుకును సిఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదని గుర్తుచేశారు. చంద్రబాబుకు వయసు మళ్లిందని, ఇప్పుడు అయినా తనకు మద్దతు ఇవ్వాలన్నారు. తాను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానన్నారు.
కాబట్టి టీడీపీ కార్యకర్తలు కూడా ఆలోచించి తనకు మద్దతు ఇవ్వాలన్నారు.చంద్రబాబు తెలుగు ప్రజల గురించి మంచి నిర్ణయం చేయండన్నారు. రెండో దోషిగా నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారన్నారు. మూడో దోషి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన తండ్రి, తల్లి తనకు ఎంతో గౌరవం ఇచ్చారని పాల్ తెలిపారు. జగన్ మాత్రం తను కలవటానికి ఆసక్తి చూపడం లేదన్నారు. సీక్రెట్ గా అయినా ఆహ్వానిస్తే తానే వెళ్లి కలుస్తానన్నారు.
రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలన్నారు. అప్పులు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని మీకు ఇచ్చారని, పాదయాత్ర తో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారని జగన్ గురించి పాల్ వ్యాఖ్యానించారు. నేడు నవ రత్నాలు ఇవ్వడానికి మీ వద్ద డబ్బులు లేవన్నారు. ఇంకా ఆరు నెలలు ఈ పధకాలకు డబ్బు ఎలా తెస్తారని ప్రశ్నించారు. తనతో కలవాలని, పరిష్కారం చూపిస్తానని పాల్ అన్నారు. లేదా మా పార్టీ లో చేరిపోవాలన్నారు. తాను అన్నీ చూసుకుంటానన్నారు. అనేక జిల్లాల్లో తన సమావేశాలు జరుగుతున్నాయని, తనకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే.. ఫలితం అనుభవిస్తారన్నారు.
Recommended Video


జగన్ ను ఏడిపించి అసెంబ్లీలో ఏడుస్తున్న చంద్రబాబు
జగన్ ను చంద్రబాబు ఏడిపించాడని ఇప్పుడు అసెంబ్లీ లో ఏడుస్తున్నాడన్నారని పాల్ తెలిపారు. తనకు ఫంక్షన్ హాల్స్ ను ఇవ్వకుండా అడ్డుకోవద్దన్నారని జగన్ కు పాల్ సూచించారు. తనకు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు శత్రువులు కాదన్నారు. కానీ పవన్ కళ్యాణ్ పొత్తుల పార్టీ లు మారుస్తూ వస్తున్నాడన్నారు. ఈ అన్నయ్య తో కలువు... నీకు అంతా మంచి జరుగుతుందన్నారు. దశావతారాలు వద్దన్నారు. తానంటే పవన్ కు గౌరవమన్నారు. తమ్ముడు ముందుకు వస్తే..కలిసి పని చేస్తామన్నారు. కమ్యూనిస్టు లు అంటే కూడా తనకు ప్రత్యేకమైన గౌరవం ఉందని పాల్ తెలిపారు.












Click it and Unblock the Notifications