జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా ! లేకపోతే శపిస్తా ! క్యాంపు ఆఫీసు దగ్గర పాల్ హంగామా..
ఏపీలో అసలే ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రతీ పార్టీ తమ అభ్యర్ధుల ఎంపికలో తల మునకలై ఉన్నాయి. కాస్తో కూస్తో సమయం దొరికితే జనంలోకి వెళ్లేందుకు ప్రతీ పార్టీ అధినేతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం ఇవాళ సీఎం జగన్ ను కలుస్తానంటూ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అపాయింట్ మెంట్ లేకపోయినా వచ్చేసినా పాల్.. జగన్ ను కలిస్తే కానీ వెళ్లనంటూ అక్కడ కాసేపు హల్ చల్ చేశారు.
ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ తాను ఎలాగైనా సీఎం జగన్ ను కలవాలని తెలిపారు. కానీ పోలీసులు ఆయన్ను ముందుకు కదలనివ్వలేదు. దీంతో కారులో కూర్చునే కాసేపు హల్ చల్ చేసిన పాల్.. అనంతరం కిందకు దిగి పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. పోలీసులు ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన వినలేదు. సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద జగన్ కోసం కేఏపాల్ చాలా సేపు వేచి చూశారు.

సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని, ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చినట్లు కేఏ పాల్ వెల్లడించారు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఇవాళంతా వేచి చూస్తానని కేఏపాల్ తెలిపారు. అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా...లేదంటే శపిస్తానంటూ పాల్ హెచ్చరికలు కూడా చేశారు. దీంతో కాసేపు అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఇప్పటికే ప్రతీ ఎన్నికల్లో పోటీ పేరుతో బరిలోకి దిగడం, లేదా అభ్యర్ధులను దించుతానంటూ హంగామా చేస్తున్న పాల్.. ఈసారి ఏపీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నారో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications