టీడీపీలో చేరుతున్న విజయసాయిరెడ్డి బావమరిది
వైసీపీ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీ మారనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి భార్య ద్వారకానాథరెడ్డికి సొంత అక్క. ఆయనతోపాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి, అక్క హరెమ్మ (నందమూరి తారకరత్నకు అత్త) కూడా పార్టీ మారుతున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. చంద్రబాబు, లోకేశ్‌తో వారు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఉమ్మడి కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లె (పునర్విభజనలో రద్దైన) నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ద్వారకానాథరెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో 1962 నుంచి ఉంది.

ద్వారకానాథరెడ్డి 1994లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన మారిణ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత ఈ నియోజకవర్గం రద్దు కాగా మండలాలన్నీ రాయచోటిలో కలిసిపోయాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారుకానీ దక్కలేదు. 2014లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. 2019లో టీడీపీ, వైసీపీ ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీచేయడానికి సిద్ధమయ్యారుకానీ ఏ పార్టీ టికెట్ దక్కలేదు. కొంతకాలం రాజకీయాలకు దూరం జరిగారు. ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు నాయకులు పోటీపడుతుండగా ద్వారకానాథరెడ్డి కూడా టికెట్ ఆశిస్తుండటంతో పోటీపడే నాయకుల సంఖ్య నాలుగుకు పెరిగింది.












Click it and Unblock the Notifications