విజయవాడ కోర్టుకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి- వివేకా హత్యలో కీలక నిందితుడితో పాటు..!
ఏపీలో ప్రజా ప్రతినిధులపై (ఎంపీలు, ఎమ్మెల్యేలు)పై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ వేగంగా సాగుతోంది. ఇదే క్రమంలో కడప ఎంపీ, సీఎం జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ విజయవాడ కోర్టులో హాజరయ్యారు. గతంలో తనపై నమోదైన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.
2015లో కడప జిల్లా తొండూరులో వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న వ్యవహారంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు దాదాపు 80 మంది వైసీపీ కార్యకర్తల పేర్లు ఉన్నాయి. దీంతో ఈ కేసులో విచారణ ఎదుర్కొనేందుకు వీరంతా ఇవాళ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కూడా రావడంతో కోర్టు వద్ద ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను కడప జైలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఈ వ్యవహారంపై విచారణ జరిపిన విజయవాడ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు వీరిద్దరూ హాజరు కావాలో, లేదో స్పష్టం కాలేదు.












Click it and Unblock the Notifications