ఏపిలో ఐదు ఐటి హబ్‌లు: పల్లె, బాబుకు ఇష్టమని..
తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో ఐటి, అనుబంధ రంగాల్లో అభివృద్ధే ధ్యేయంగా నూతన ఐటి పాలసీని రూపొందిస్తున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, ఐటి, కమ్యూనికేషన్స్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టంచేశారు. మంత్రి బుధవారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఐటి ఉత్పత్తుల టర్నోవర్ 65వేల కోట్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ టర్నోవర్ 1,300 కోట్ల రూపాయలు మాత్రమే ఉందన్నారు.
రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్రంలో ఐటి, ఈ-గవర్నెన్స్, ఎలక్ట్రికల్స్, ఇన్నోవేషన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ మిషన్స్‌ను చేపట్టనున్నట్టు చెప్పారు. ఐటి శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టమైన శాఖ అని తెలిపారు.

విశాఖ, విజయనగరం, కాకినాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఐటి హబ్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిన్న తరహా ఐటి సంస్థలకు 4-జి టెక్నాలజీ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఇప్పటికే విప్రో, టెక్ మహీంద్ర తదితర సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లు నెలకొల్పేందుకు సంసిద్ధత తెలియజేశాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంక్షేమానికి కోటి రూపాయల సంక్షేమ నిధిని పెంచే అవకాశం ఉందని తెలిపారు. జర్నలిస్ట్‌ల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని, అర్హులైన జర్నలిస్టులందరికీ సౌలభ్యం మేరకు ఇళ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమణలకు గురైన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, అన్యాక్రాంతమైన ప్రతి సెంటు భూమిని వెనుకకు తీసుకునే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పల్లె చెప్పారు. ముస్లిం యువతకు ఉపాధి నిమిత్తం వివిధ వృత్తులకు సంబంధించిన కోర్సులు ప్రవేశపెడుతున్నామని, అందుకు అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications