30 ఏళ్ల తర్వాత టిడిపి చరిత్ర: మేయర్ రేసులో కాపు మహిళలు వీరే!
కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 48 స్థానాలకు గాను టిడిపి 32 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. వైసిపి 10, బిజెపి 3, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.
Recommended Video

విజయవాడ: కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 48 స్థానాలకు గాను టిడిపి 32 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. వైసిపి 10, బిజెపి 3, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టిడిపి సత్తా చాటింది. కాకినాడ నగరపాలక సంస్థను టిడిపి కైవసం చేసుకొని చారిత్రక విజయం సాధించింది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది.

జగన్‌కు మరో చేదు
పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. నంద్యాల తర్వాత వైసిపికి కాకినాడ మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. నంద్యాల ఫలితంతో ఇప్పటికే వైసిపి శ్రేణుల్లో అధినేత సత్తాపై నమ్మకం సన్నగిల్లింది. కాకినాడ కార్పొరేషన్ ఫలితం జగన్ పార్టీని మరింత కుంగదీసింది.

గెలిచిన వారిలో ఇద్దరు టిడిపి రెబల్స్, డప్పుకొట్టిన మంత్రులు
టిడిపి, బిజెపిలు ఉమ్మడిగా పోటీ చేశాయి. టిడిపి 39 చోట్ల, బిజెపి 9 చోట్ల పోటీ చేశాయి. ఇప్పుడు ఇరు పార్టీలు కలిసి 35 చోట్ల గెలిచాయి. రెండు చోట్ల టిడిపి రెబల్స్ గెలిచారు. బిజెపి అభ్యర్థులు ఉన్నచోట టిడిపి రెబల్స్ పోటీ చేయడంపై కమలం పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కాకినాడలో గెలుపు తర్వాత మంత్రులు డప్పు కొట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పలువురు నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు.

కాపులకే మేయర్ పదవి
కాకినాడలో టిడిపి గెలుపు నేపథ్యంలో మేయర్ ఎవరు అనే చర్చ సాగుతోంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు అవసరమైన మెజార్టీని సొంతంగానే సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మేయర్ పీఠాన్ని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ గతంలో టిడిపి నాయకత్వం ప్రకటించింది. ఎవరిని ఆ పీఠంపై కూర్చోబెడతారనే అంశంపై చర్చ జరుగుతోంది.

మేయర్ రేసులో నలుగురు, బాబు చెప్తే ఓకే..
కాకినాడ నగర మేయర్ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి (వరలక్ష్మి), సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్టుగా తెలుస్తోంది. మేయర్ ఎంపికపై టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం ఎవరి పేరు ప్రకటించినా మద్దతిస్తామని కార్పోరేటర్లు అంటున్నారు.

సుంకర శివప్రసన్న భర్త
సుంకర శివప్రసన్న భర్త సుంగర విద్యాసాగర్ టిడిపిలో కీలక నేత. అతనికి కాకినాడలో గట్టి పట్టు ఉంది. సుంకర శివప్రసన్న ఎంబీయే చేశారు. ఆమె ఉన్నత చదువులు చదవడంతో మేయర్ రేసులో ముందున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పల మద్దతు వీరికి ఉన్నట్లుగా తెలుస్తోంది.

వరలక్ష్మి, శేషకుమారి కూడా
అడ్డూరి వరలక్ష్మి కూడా రేసులో ఉన్నారు. ఈమెకు ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు మద్దతు ఉంది. వరలక్ష్మి న్యాయవాది. ఆమె పట్టుబట్టి పోటీ చేశారని తెలుస్తోంది. శేషకుమారి కూడా మేయర్ రేసులో ఉన్నారు.

రేసులో సుంకర పావని
సుంకర పావని కూడా రేసులో ఉన్నారు. పావని భర్త సుంకర తిరుమల కుమార్. ఈయన కాకినాడ నగర అధ్యక్షులు. సుంకర పావనికి కాకినాట ఎంపి తోట నర్సింహం, మరికొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉంది.












Click it and Unblock the Notifications