ఏపీపై కల్వకుంట్ల కవిత గురి - చిక్కేదెవరు..?
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ దిశగా వేగంగా పావులు కదులుతున్నాయి. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఏపీలో బహిరంగ సభకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 19న ఖమ్మం సభలో పాల్గొనాల్సిందిగా ఏపీ బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం అందింది. ఆ తరువాత ఏపీలో కేసీఆర్ సభ ముహూర్తం ఖరారు కానుంది. ఏపీలో చేరికలు.. సభ నిర్వహణతో పాటుగా విస్తరణ కార్యచరణ పైన ఎమ్మెల్సీ కవిత ఫోకస్ పెట్టారు. ఇందు కోసం ఈ నెలాఖరులో ఏపీలో కవిత పర్యటించనున్నారు. ఏపీ బీఆర్ఎస్ సమన్వయకర్తగా కవితకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏపీ బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిగాయి.

ఏపీలో బీఆర్ఎస్ - కవిత పర్యటన
బీఆర్ఎస్ నేత..సీఎం కేసీఆర్ కుమార్తె ఏపీకి వస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపైన ప్రధానంగా ఈ పర్యటన ఉండనుంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తో పాటుగా రావెల కిషోర్ బాబు.. పార్ధసారధి తాజాగా కవితతో సమావేశమయ్యారు. ఏపీలో పార్టీలో చేరికలు..విస్తరణ దిశగా తీసుకుంటున్న చర్యల పైన చర్చించారు. మరి కొంత మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని పార్టీ నేతలు కవితకు వివరించారు. ప్రస్తుతం పార్టీ నేతలంతా ఖమ్మం సభ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో అధ్యక్షుడు కేసీఆర్ పర్యటనలు ఉండనున్నాయి. బడ్జెట్ సమావేశాల తరువాత పూర్తి స్థాయిలో పర్యటనలకు కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు సమాచారం.

పార్టీలో చేరికలు - కార్యాచరణ
ఈ నెల 29న కవిత ఏపీలో పర్యటించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ఏపీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ సమక్షంలోనే పార్టీలో చేరాలని భావిస్తున్నారని ఏపీ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఏపీలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య రాజకీయం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను కవిత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ముందుగా చేరికలు..రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీలోకి వచ్చే వారికి గుర్తింపు దక్కేలా కమిటీల్లో స్థానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బీజేపీకి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు మద్దతుగా నిలుస్తుండటంతో...ఆ పార్టీలతో పాటుగా బీజేపీని వ్యతిరేకించే వారికి బీఆర్ఎస్ వేదికగా మారనుంది.

టీడీపీ - జనసేన పొత్తుతో వ్యూహాత్మకంగా
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ కూడా గుంటూరు కేంద్రంగా భారీ స్థాయిలో నిర్వహణకు సిద్దం అవుతున్నారు. ఈ లోగా మరి కొందరు నేతలను పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఏపీ ప్రధాన కార్యాలయం నుంచి సిద్దం అవుతోంది. ఏపీలో జనసేన..టీడీపీ పొత్తు ఖాయం కావటంతో ఏపీలో రానున్న రోజుల్లో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. పొత్తు ప్రభావం బీఆర్ఎస్ లో కొత్త చేరికలకు దోహదం చేస్తుందనే అంచనాలు పార్టీ నేతలు అంచనా చేస్తున్నారు. దీంతో, మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ నెలఖరులో బీఆర్ఎస్ కు సంబంధించి ఏపీలో కీలక పరిణామాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏ పార్టీపై ఉంటుందనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications