Amaravati: అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్, పీఎన్జీ నెట్ వర్క్-చంద్రబాబు నిర్ణయాలు..!
ఏపీ రాజధాని నగరం అమరావతి (Amaravati)లో మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఆర్డీయే అథారిటీతో జరిగిన తాజా సమీక్షలో చంద్రబాబు.. అమరావతిలో పనుల పురోగతిపై ఆరా తీశారు. దీంతో పాటు రాజధానిలో ఏర్పాటు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాలపై వారికి పలు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన అనుమతుల విషయంలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు.
రాజధాని ప్రాంతంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాల అంశంపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. బ్యాంకు కార్యాలయాల నిర్మాణాలకు సీఆర్డీఏ వైపు నుంచి పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. బ్యాంక్ స్ట్రీట్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన 13 బ్యాంకుల్లో 11 సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణ బాధ్యతలను సీపీడబ్ల్యూడీకు అప్పగించారని అధికారులు తెలిపారు. పూర్తి సమన్వయంతో త్వరితగతిన ఈ నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు.

అలాగే రాజధానిలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఫోన్, కేబుల్, ఇంటర్నెట్ కనెక్టివిటీలకు సంబంధించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలన్నారన్నారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతులను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. అమరావతిని నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, నివాస వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పైప్డ్ గ్యాస్ కనెక్షన్ తో పాటు , ఇండక్షన్ స్టవ్‌ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, డిస్ట్రిక్ట్ కూలింగ్ వంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వరకు ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా చూడాలన్నారు.














Click it and Unblock the Notifications