ఇంద్రకీలాద్రిపై వరుస అపచారాలు.. ఆ పాలతో అభిషేకం చేసిన వారిపై వేటు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చోటు చేసుకున్న తాజా ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. నిత్య పూజల్లో అత్యంత పవిత్రంగా భావించే శ్రీ చక్ర నవావర్ణార్చన సమయంలో అనుకోని అపశ్రుతి ఎదురవ్వడం కలకలం రేపింది. అమ్మవారి అర్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్‌లో పురుగులు కనిపించడంతో పూజ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ ఘటన ఆలయ ప్రతిష్ట, పూజా విధానాలపై ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది.

ప్రతి శుక్రవారం అత్యంత వైభవంగా జరిగే శ్రీ చక్ర అర్చనలో భాగంగా అమ్మవారికి గో క్షీరంతో అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. అయితే అర్చన ప్రారంభానికి ముందు ఉపయోగించాల్సిన ప్యాకెట్ పాలలో పురుగు ఉన్నట్లు అర్చకులు గుర్తించారు. దీంతో వెంటనే పూజను నిలిపివేశారు. దాదాపు అరగంట పాటు అర్చన ఆగిపోవడంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు అయోమయంలో పడిపోయారు. అనంతరం తాజా ఆవు పాలను తీసుకొచ్చి పూజను తిరిగి ప్రారంభించారు.

ఈ ఘటనపై భక్తులు, ధార్మిక వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. శాస్త్రోక్తంగా దేవతామూర్తుల అభిషేకానికి తాజా గో క్షీరం మాత్రమే వినియోగించాల్సి ఉండగా, నిల్వ ఉంచిన టెట్రా ప్యాకెట్ పాలను వాడటం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి. పవిత్రమైన పూజలకు ఉపయోగించే ద్రవ్యాల నాణ్యతను ముందుగా తనిఖీ చేయకపోవడం ఆలయ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తాయి.

Kanaka Durga Temple Row Insect Found in Milk During Sacred Sri Chakra Archana Officials Take Swift Action

ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో దేవస్థానం యంత్రాంగం తక్షణమే స్పందించింది. భక్తుల మనోభావాలు, దేవస్థానం ప్రతిష్ట దృష్టిలో ఉంచుకుని స్థానాచార్యులతో కూడిన కమిటీ సూచనల మేరకు కఠిన చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

ఆలయ యంత్రాంగం తీసుకున్న చర్యలు

శ్రీచక్ర నవావర్ణార్చన నిర్వహించిన అర్చకులు డి.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్య శర్మపై అభియోగాలు నమోదు చేసి, ఆయనను ఆ విధుల నుంచి తొలగించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా దర్బార్ సేవ, పల్లకీ సేవ, లక్ష కుంకుమార్చన పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే, లక్ష కుంకుమార్చన బాధ్యతలు నిర్వహిస్తున్న ఏ.వి.ఎస్. రవి తేజను శ్రీచక్ర నవావర్ణార్చన అర్చకునిగా నియమించారు. పూజ పరిచారకులు, స్టోర్స్ విభాగం సిబ్బంది, పూజల విభాగానికి చెందిన పలువురు ఉద్యోగుల విధులు కూడా మార్పు చేశారు.

పూజా కార్యక్రమాల్లో సమన్వయ లోపం, పర్యవేక్షణ లోపంపై పూజా విభాగం ఏఈఓ బి.వి. రెడ్డి, సూపరింటెండెంట్ పి. సునీత, జూనియర్ అసిస్టెంట్ టి. సుబ్రహ్మణ్యం, ఎన్‌ఎంఆర్ శైలజలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అదేవిధంగా పూజా ద్రవ్యాల నాణ్యత తనిఖీలో విఫలమైనందుకు ప్రొవిజన్ స్టోర్స్ సూపరింటెండెంట్ బి. కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ కె. సీతారామయ్యల నుంచి సంజాయిషీ కోరుతూ గడువు విధించారు. అలాగే శ్రీచక్ర పూజా ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సకాలంలో అందజేయని కారణంగా ఇంజనీరింగ్ విభాగం ఈఈ కోటేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఆలయ అధికారులు స్పష్టీకరిస్తూ, సదరు పాలు పూజలో వినియోగించలేదని, అదే రోజున ప్రత్యామ్నాయంగా తాజా ఆవు పాలను ఏర్పాటు చేసి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించామని తెలిపారు. పూజలో ఎలాంటి అపచారం జరగలేదని, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనతో కనకదుర్గమ్మ ఆలయంలో పూజా విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమన్న డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తోంది. ఆలయ ప్రతిష్టకు మచ్చ పడకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయన్నది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+