బీసీ, కాపుల కేంద్రంగా జనసేన మ్యానిఫెస్టో ? హరిరామజోగయ్య లీకులు...!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు జనసేన తరఫున ఇవ్వబోయే మ్యానిఫెస్టోపై మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం నేత చేగొండి హరిరామజోగయ్య ఇవాళ కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఇందులో ఏయే వర్గాలకు ఈసారి జనసేన ప్రాధాన్యం ఇవ్వబోతోందన్న దానిపై హింట్ ఇచ్చారు. అలాగే ఈసారి టీడీపీతో జనసేన పొత్తు నేపథ్యంలో ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనకు సంబంధించి కూడా జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన మ్యానిఫెస్టో రూపకల్పన కోసం ప్రస్తుతం ప్రజలు, మేధావి వర్గాలతో చర్చలు జరుగుతున్నట్లు హరిరామజోగయ్య వెల్లడించారు. వారి సూచనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపొందుతోందని జోగయ్య తెలిపారు.అలాగే ఈ మ్యానిఫోస్టోలో ఉండే అంశాలకు సంబంధించి జోగయ్య లీకులు ఇచ్చారు. టీడీపీతో పొత్తు నేపథ్యంలో తమవైపు నుంచి ఉండే ప్రతిపాదనలను ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో సమస్యలను అంశాల వారీగా చర్చించి జనసేన, తెలుగుదేశం ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చుతామని జోగయ్య తెలిపారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబంలో ఒకరికి కచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధి అవకాశం కల్పించాలనేది తమ మొదటి లక్ష్యమని జోగయ్య తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కోస్తా కారిడార్ విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఈసారి జనసేన తరఫున ఇచ్చే మ్యానిఫెస్టోలో బీసీలకు కనీసం 30శాతం విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన ఉన్నట్లు జోగయ్య వెల్లడించారు. అదే సమయంలో కాపుల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని కూడా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 18 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెలాఖరులోగా 9848634249, 7036924692 ఫోన్ నెంబర్లలో మ్యానిఫెస్టోపై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications