పవన్ ను ఇరుకునపెడుతూ జోగయ్య మరో లేఖ-దత్తత ప్రస్తావన..!
ఏపీలో ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ లేఖలు రాయడంలో ప్రసిద్ధుడైన కాపు నేత హరిరామజోగయ్య ఇవాళ కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వాలను ఉద్దేశించి మరో లేఖ రాశారు. ఇందులో ఆయన ప్రధానంగా గోదావరి జిల్లాల అభివృద్ధిని ప్రస్తావించారు. అలాగే వైసీపీ గతంలో ఎలాగైతే గోదావరి జిల్లాలను నిర్లక్ష్యం చేసిందో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తున్నారని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ.. గోదావరి జిల్లాల అభివృద్ధి పట్టదా అంటూ హరిరామజోగయ్య తన తాజా లేఖ రాశారు. ఇందులో గోదావరి జిల్లాల అభివృద్ధితో పాటు నరసాపురం - కోటిపల్లి రైల్వే లైన్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు, వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు వంటి అంశాల్ని ప్రస్తావించారు. వీటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఎన్డీయే ప్రభుత్వాలపై జోగయ్య విమర్శలు గుప్పించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలకు హరిరామజోగయ్య పలు సూచనలు చేశారు. ఇందులో గోదావరి పరివాహక ప్రాంతంలో అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజం, పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేయడంతో పాటు నరసాపురం-మచిలీపట్నం వరకు కొత్త రైల్వే నిర్మించాలన్నారు. అలాగే అంతర్వేది డ్రెడ్జింగ్ హార్బర్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అటు వశిష్ట గోదావరిపై నరసాపురం సఖినేటిపల్లి, కోడేరు - అయోధ్య లంక వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా, తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ వంటి మరికొన్ని డిమాండ్లు కూడా లేఖలో ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలని జోగయ్య కోరారు. అలాగే గోదావరి జిల్లాల్లో జాతీయ రహదారులన్నీ విస్తరించాలని కూడా జోగయ్య లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications