హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
ఏపీలో నిన్న మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ కోసమేనంటూ ఆయన్నే టార్గెట్ చేస్తూ విపక్ష కూటమిని ఇరుకునపెట్టిన కాపు నేత హరిరామ జోగయ్య ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఓ దశలో పవన్ రివర్స్ కావడంతో తన కాపు సంక్షేమ సేనను రద్దు చేసేసిన జోగయ్య ఇవాళ మరో సేన ఏర్పాటు చేశారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. పిఠాపురంలో పోటీ వేళ జోగయ్య ప్రకటన పవన్ కు భారీ ఊరట కానుంది.
రాష్ట్రంలో గతంలో తన ఆధ్వర్యంలో పనిచేసిన కాపు సంక్షేమ సేనను ఈ మధ్యే రద్దు చేసేసిన హరిరామ జోగయ్య ఇప్పుడు యూటర్న్ తీసుకుని తిరిగి రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేనను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టేందుకు వీలుగా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన పని చేస్తుందని దాని అధ్యక్షుడు హరిరామ జోగయ్య ప్రకటించారు.

గతంలో ఉన్న కాపు సంక్షేమ సేన రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో నూతనంగా కాపు బలిజ సంక్షేమ సేన స్థాపించామని,25 మంది సభ్యులు తో నూతన కమిటీ ఏర్పాటు చేసినట్లు హరిరామ జోగయ్య తెలిపారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టే సత్తా పవన్ కళ్యాణ్ కే ఉందని తాను నమ్ముతున్నట్లు జోగయ్య పేర్కొన్నారు. తన ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ లోని సభ్యులైన గుర్రాలు అన్నీ పవన్ కళ్యాణ్ వెంట పరుగులు పెడతాయన్నారు.
రాష్ట్రంలోకాపులు, బీసీ, ఎస్సీలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయం అన్నారు. కాపులను యాచించే స్థాయి నుండి సాసించే స్థాయికి ఎదగాలన్నదే కాపు బలిజ సంక్షేమ సేన పని చేస్తుందని జోగయ్య చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications