వైసీపీలోకి ముద్రగడ ఎంట్రీ ఫిక్స్ - ఆపరేషన్ జనసేన..!!
ఏపీలో ఎన్నికల యుద్దం తారా స్థాయికి చేరింది. గోదావరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికి అధికారం దక్కటం ఖాయం. దీంతో, వైసీపీ అలర్ట్ అయింది. కాపు ఉద్యమ నేత ముద్రగడతో మంత్రాంగం నడిపింది. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయించింది. జనసేన టార్గెట్ గా వైసీపీ ఆపరేషన్ మొదలు పెట్టింది.
ముద్రగడ చేరిక: గోదావరిలో టీడీపీ, జనసేన లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే హరిరామజోగయ్య కుమారుడిని తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ, ఇప్పుడు ముద్రగడ లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ గతంలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, ముద్రగడ - వైసీపీ నేతల మధ్య సీట్ల పైన జరిగిన చర్చల్లో స్పష్టత రాకపోవటంతో చేరిక ఆగిపోయింది.

ఆ తరువాత జనసేన నేతల తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. స్వయంగా ముద్రగడ కిర్లింపూడిలోని ముద్రగడ ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లి ఆహ్వానించేందుకు నిర్ణయించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తరువాత ముద్రగడను కలుస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు.
పోటీ చేస్తారా: కానీ, పవన్ చెప్పినట్లుగా తన ఇంటికి రాకపోవటంతో ముద్రగడ జనసేనలో చేరాలనే నిర్ణయం విరమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కు రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. పవన్ ఇతరుల అనుమతితోనే తనను కలవాల్సి ఉంటుందని ఎద్దేవా చేసారు. పవన్ తీరు పైన ముద్రగడ అసంతృప్తికి గురయ్యారు.
ఇక..ముద్రగడ జనసేనలో చేరటంలో లేదని స్పష్టత రావటంతో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఆయన కుమారుడితో చర్చలు జరిపారు. నేరుగా తన తండ్రితోనే చర్చించాలని సూచించారు. వరుసగా జరిగిన చర్చల ఫలితంగా ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసీపీకి మద్దతివ్వటానికి నిర్ణయించారని సమాచారం. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం.
వైసీపీ ఆపరేషన్: ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదన ఉన్నా..దీని పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ముద్రగడ పార్టీలోకి వస్తే పిఠాపురం నుంచి పవన్ పైన బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. అయితే, పిఠాపురం నుంచి వంగా గీత కొనసాగుతారని పార్టీ నేతల సమాచారం. ముద్రగడ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని చెబుతున్నారు.
జనసేనలో సీట్లు రాని కాపు నేతలను ఆకర్షించేందుకు వైసీపీ ఆ పార్టీ పైన ముద్రగడ అస్త్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో, ముద్రగడ వైసీపీలో చేరితే గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా తూర్పు గోదావరిలో చోటు చేసుకొనే రాజకీయంపైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications