లక్నోలో డబుల్ మర్డర్.. భార్య, సోదరిని చంపి.. ఆపై సూసైడ్.. ఏం జరిగిందంటే..?
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఎస్బీఐ ఉద్యోగి నగరంలో నరమేధం సృష్టించాడు. తన భార్యను, చెల్లిని కిరాతకంగా కాల్చి చంపాడు. అంతేకాక తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాను మోసపోయానంటూ వాట్సాప్ లో స్టేటస్ లు పెట్టాడు. ఈ మొత్తం ఉదంతం కొన్ని గంటల వ్యవధిలోనే జరిగింది. ఈ డబుల్ మర్డర్, సూసైడ్ ఘటనలు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. విడాకుల వివాదమే ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్తాయిలో దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. లక్నోలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో మానస్ వాజ్ పేయి(38) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య దివ్య మిశ్రా ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తోంది. అయితే ఏడాది నుంచి వీరిమధ్య విడాకుల వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో గోమతి నగర్ లోని ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు మానస్ వాజ్ పేయి వెళ్లాడు. తన భార్య దివ్యా మిశ్రాను బయటకు పిలిచి కొద్దిసేపు మాట్లాడినట్లు చేసి.. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు.
తీవ్రంగా గాయపడిన దివ్యను హుటాహుటిన స్థానికంగా ఉన్న లోహియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాడి అనంతరం తన ఇంటికి పారిపోయాడు మానస్.. అక్కడ వికలాంగురాలైన అతని సోదరి శివ వాజ్‌పేయిని కూడా కిరాతకంగా కాల్చి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు.

ఇవాళ నన్ను మోసం చేసిన భార్యను చంపేశాను.. నా సోదరిని.. ఆమె సోదరిని.. ప్రతి ఒక్కరినీ చంపేయాలి. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలి.. అని స్టేటస్ పెట్టాడు మానస్. అతని వాట్సాప్ స్టేటస్ చూసిన స్థానికులు భయాందోళనకు గురై ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే తన సోదరితో పాటు మానస్ కూడా మృతి చెంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలు, విడాకుల పిటిషన్, అనుమానం తదితర కారణాలతోనే మానస్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications