అనకాపల్లి-సోలాపూర్ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! చర్లపల్లి-శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్స్..!
ఏపీ-తెలంగాణ-మహారాష్ట్ర పరిధిలో మూడు కొత్త రైలు సర్వీసులు (New Trains) ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో ఒకటి అనకాపల్లి-సోలాపూర్ వీక్లీ ఎక్స్ ప్రెస్ (Anakapalli-Solapur Weekly Express) కాగా.. మరో రెండు ప్రత్యేక రైళ్లు చర్లపల్లి-శ్రీకాకుళం (Charlapalli-Srikakulam Special Trains) మధ్య రాకపోకలు సాగిస్తాయి. దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఈ మేరకు వివరాలు విడుదల చేశారు. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, ఏయే రోజుల్లో రాకపోకలు సాగిస్తాయి, ఏయే స్టేషన్లలో ఆగుతాయి, వీటిలో ఎన్ని కోచ్ లు అందుబాటులో ఉంటాయన్న వివరాలు ఇందులో ఉన్నాయి.
ముందుగా రేపటి నుంచి సోలాపూర్-అనకాపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు (నం.11313) అందుబాటులోకి రానుంది. ఇది ప్రతి శుక్రవారం సోలాపూర్ నుండి ఉదయం 9:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:40 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. అలాగే ఆగస్టు 22 నుండి మరో రైలు (నం. 11314) అనకాపల్లి-సోలాపూర్ మధ్య ప్రారంభం కానుంది. ఇది అనకాపల్లి నుండి ప్రతీ శనివారం సాయంత్రం 5:35 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11:50 గంటలకు సోలాపూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కలబురగి, వాడి, రాయచూర్, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం మీదుగా అనకాపల్లి చేరుకుంటుంది.

మరోవైపు చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 25న చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు (నం. 07037) అందుబాటులోకి వస్తుంది. ఇది చర్లపల్లిలో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు శ్రీకాకుళానికి చేరుకుంటుంది. అలాగే శ్రీకాకుళం రోడ్డు నుంచి చర్లపల్లికి మరో రైలు (నం.07126) ఆగస్టు 26 నుంచి అందుబాటులోకి రానుంది. ఇది శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ లో మధ్యాహ్నం 1.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు చర్లపల్లి స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకూ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి హాల్ట్ లు ఇచ్చారు. ఈ రెండు రైళ్లలోనూ 3 సెకండ్ ఏసీ, 5 ధర్డ్ ఏసీ, 20 స్లీపర్, 4 జనరల్ కోచ్ లు ఉంటాయి.













Click it and Unblock the Notifications