కాపు కాసే 'కాపు' కోసం కాపుల ఎదురుచూపులు
తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి కావాలంటూ కొన్ని సంవత్సరాలుగా వారిలో వారు నినదిస్తూనే ఉండిపోయారు.
ఏపీలోని కాపు సామాజికవర్గం మొత్తం డైలామాలో పడింది. మొదటి నుంచి తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చూడాలని, రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని అనుకుంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతుండేవి. దీంతో వారిలో మరింత నిరుత్సాహం నెలకొంది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత తమ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవబోతున్నారని ఆనందపడిపోయారు. తిరుపతిలో గెలుపొందినప్పటికీ సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడంతో కాపులంతా హతాశులయ్యారు.

కొన్ని సంవత్సరాలుగా నినదిస్తున్నారు..
తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి కావాలంటూ కొన్ని సంవత్సరాలుగా వారిలో వారు నినదిస్తూనే ఉండిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజికవర్గం, తెలుగుదేశం అధికారంలోకి వస్తే కమ్మ సామాజికవర్గానికి చెందినవారే ముఖ్యమంత్రి అవుతుండటంతో ఎప్పటికైనా తమ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడగలమా? అనే సందేహం వారిని వెంటాడుతుండేది. రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి పదవికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేరు వినపడినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని వరించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ రూపంలో వారికి ఓ ఆదరవు దొరికింది.

కాంగ్రెస్ లో విలీనమైన ప్రజారాజ్యం
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ జనసేన రూపంలో కాపు సామాజికవర్గానికి మరో ప్రత్యామ్నాయం దొరికిందని ఆనందపడ్డారు. ఆశలు కూడా భారీగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చి వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళుతున్న జనసేన అధినేతకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదుకదా అనేది కాపుల యోచనగా ఉంది. పవన్ మాత్రం పదవుల కోసం వెంపర్లాడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అవసరమైతే తాను త్యాగాలకు కూడా సిద్ధమంటున్నారు.

కాపు నాయకులు ఏం చేస్తున్నారు?
కాపు నాయకులు అసలు ఏం చేస్తున్నారు? రాజకీయంగా అత్యున్నత పదవిని ఎందుకు అధిరోహించలేకపోతున్నారు? ఏదో ఒక పార్టీతో పొత్తు కోసమే రాజకీయం చేయాలా? అనే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. తాజాగా బీజేపీకూడా ఏపీలో కాపులను ఆలంబనగా చేసుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటోంది. దీనివల్ల కాపులకు కలిగే లాభం ఏమైనా ఉందా? అనే మేథోమధనం జరుగుతోంది. అవకాశం దొరికినప్పడల్లా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు పలువురు సమావేశమవుతూనే ఉన్నారు. కానీ వారికి కూడా పరిష్కారం లభించడంలేదు. తాజాగా రెండురోజుల క్రితం జగ్గంపేటలో కూడా కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. కాపులు వ్యక్తిగతంగా ఎదగాల్సింది పోయి ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా సొంత ఎదుగుదల దెబ్బతింటుందని భావిస్తున్నారు. అయితే సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగినప్పటికీ ఏ నిర్ణయానికీ రాలేకపోయారు. మనలో మనమేన ఐక్యంగా ఉంటూ ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications