తట్టుకోలేరు, కాపులు బీసీలోకి: బాబు, కేసీఆర్ కూడా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా తనతో అన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసన సభలో తెలిపారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. తన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. అయితే విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో చిక్కుకుందన్నారు. సంక్షోభాల్ని అవకాశంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి జిల్లాకు ఓ మెగా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. డీప్ వాటర్ పోర్టులను ఏర్పాటు చేస్తే ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయన్నారు. సీ కార్గో మన రాష్ట్రం నుండే వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. జిల్లాకో హార్డ్‌వేల్, ఎలక్ట్రానిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరంలో తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. 14 పోర్టులను అభివృద్ధి చేయాలనుంటున్నట్లు చెప్పారు.
విశాఖకు పోతే తాను ప్రపంచాన్నే మర్చిపోతానని చెప్పారు. భారత దేశానికే ఆర్థిక రాజధాని కాగల సత్తా విశాఖకు ఉందన్నారు. ముంబై తర్వాత మరో ముంబైగా విశాఖను తయారు చేయవచ్చన్నారు. విశాఖలో హైటెక్ సిటీ కంటే మెరుగైన సిటీని నిర్మిస్తామన్నారు. కాపులను బీసీలలో చేరుస్తామని, వారిని బీసీలలో చేర్చడం ద్వారా వెనుకబడిన వర్గాలకు నష్టం జరగకుండా చేస్తామన్నారు.

ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోవద్దని, అయినప్పటికీ తాను ఇక్కడ కూర్చోవడానికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలే అన్నారు. వారి రుణం ఎలా తీర్చుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆ జిల్లాకు తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. మన సంస్కృతిని మర్చిపోతే కష్టాలు తప్పవన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్వాను అభివృద్ధి చేస్తామన్నారు. కూచిపూడి ఎక్కడ పుట్టిందో అక్కడ మాత్రం లేదని, అక్కడ కూచిపూడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
తాను పాదయాత్రలో ప్రజల కష్టాలను చూశానని చెప్పారు. రాయలసీమను కరవులేని ప్రాంతంగా చేస్తామన్నారు. కొందరు తమ జిల్లా మాత్రమే అభివృద్ధి కావాలనుకుంటారని, తాను మాత్రం తన జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలని కోరుకుంటానని అన్నారు. తిరుపతి పవిత్ర క్షేత్రమని, అందుకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. కడప జిల్లాలో తమకు ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, అయినంత మాత్రాన ఆ జిల్లాను వదిలివేయలేదన్నారు.
నూజివీడులో మామిడి రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలులో మైన్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలును స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామన్నారు. ఒంగోలులో విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. కడపలో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, టూరిస్ట్ హబ్‌గా మారుస్తామన్నారు. కడపను కూడా స్మార్ట్ సిటీగా చేస్తామన్నారు. పుట్టపర్తిని స్పిరిచ్యువల్ కేంద్రంగా చేస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు అన్ని అడ్డంకులు తొలగించిన ఘనత ఎన్డీయే సర్కార్‌దే అన్నారు. పోలవరం పూర్తయితే కరువు ఉండదన్నారు. అడ్డగోలు విభజన వల్ల వచ్చిన సమస్యలపై తెలంగాణ కేసీఆర్‌తో ఇప్పటికే చర్చించానని వెల్లడించారు. సివిల్ సెర్వెంట్లు, ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాలేదన్నారు. చంద్రబాబు మాట్లాడుతుండగా మధ్యలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు కల్పించుకునే ప్రయత్నం చేయగా.. తన ఆత్మస్థైర్యాన్ని మీరెవరూ తట్టుకోలేరన్నారని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications