కెసిఆర్ జట్టు: మహిళకు, పాలమూరుకు నో చాన్స్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తొలి మంత్రివర్గంలో మహిళలకు ఎవరికీ చోటు దక్కలేదు. పద్మాదేవేందర్ రెడ్డికి అవకాశం వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ, మహిళలు ఎవరు లేకుండానే కెసిఆర్ తన జట్టు కూర్పుకున్నారు.
అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రివర్గలో చోటు దక్కలేదు. కొప్పుల ఈశ్వర్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, వరంగల్ జిల్లాకు చెందిన టి. రాజయ్యకు అవకాశం కల్పించడంతో ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం

కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులను తీసుకున్నారు. హజూరాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో కరీంనగర్ జిల్లాకు అంతకు మించి స్థాన కల్పించలేకపోయారు.
మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన టి. హరీష్ రావుకు మంత్రివర్గంలో చేరారు. కెసిఆర్ గజ్వెల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. త్వరలో పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. మలి విడత విస్తరణలో మహిళలకు, గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాకు కూడా మంత్రి వర్గంలో చోటు లభించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. విస్తరణలో ఆయనకు చోటు లభించే అవకాశం ఉంది.
నలుగురు రెడ్లు, ఇద్దరు వెలమలు, ఇద్దరు బిసీలు, ఒక ఎస్సీ, ఒక మైనారిటీ, ఒక ఎస్టీలకు కెసిఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. బిఎస్పీ నుంచి తెరాసలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డికి కూడా చోటు దక్కలేదు.


Click it and Unblock the Notifications