వాస్తు: ఇంటినుండే కెసిఆర్! తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజులు ఇంటి నుండే కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది. కెసిఆర్ క్యాంపు కార్యాలయానికి మారేందుకు కొద్ది రోజులు పట్టనుంది. బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వాస్తుదోషం ఉందని భావించిన కెసిఆర్ ప్రత్యామ్నాయ భవనాల కోసం ఆరా తీసిన నేపథ్యంలో కుందన్ బాగ్‌లోని మూడు భవనాలను తాత్కాలికంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయా భవనాలలో పలువురు అధికారులు ఉంటున్నారు. వారు రెండు మూడు రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తారు. అనంతరం అవసరమైన మరమ్మతులు, స్వల్ప వాస్తుమార్పులు చేయనున్నారు. దీనికి కొద్ది రోజులు సమయం పడుతుంది. ఆ తర్వాత మంచి రోజు చూసుకొని కెసిఆర్ క్యాంపు కార్యాలయానికి మారనున్నారు. ఈ నేపథ్యంలో పక్షం రోజుల పాటు కెసిఆర్ నందినగర్‌లోని స్వగృహం నుండే కార్యకలాపాలు కొనసాగించనున్నారు.

తెరాసలో చేరిన బిఎస్పీ ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బిఎస్పీ నుంచి గెలిచారు. వీరు కెసిఆర్ సమక్షంలో ఆదివారం తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో 63 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. వీరిద్దరి చేరికతో టిఆర్‌ఎస్ బలం 65కు చేరుకుంది.
బిఎస్పీని తెరాసలో వీలీనం చేసినట్టు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మాయావతితో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తమ నియోజక వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే తెరాసలో చేరినట్టు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్‌తోనే సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications