బాబుపై కేసీఆర్ ఫిర్యాదు, జవాబు చెబుతామని దేవినేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కక్ష సాధిస్తున్నారని, ఇక్కడి విద్యుత్ సమస్యలకు ఆయననే బాధ్యుడని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌కు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు 54 శాతం వాటా ఇవ్వడం లేదని, కృష్ణపట్నం నుండి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారని, శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని సమస్యాత్మకంగా మార్చి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన విద్యుత్, శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి బడ్జెట్ సమావేశాల గురించి చర్చించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు చంద్రబాబు నిత్యం ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. చంద్రబాబు కక్ష కట్టారని, ఆయన వల్లనే తెలంగాణలో విద్యుత్ సమస్యలు వచ్చాయని ఫిర్యాదు చేశారు. విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు పక్క రాష్ట్రాలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు.

కాగా, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన 265 టిఎంసిల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని కేసీఆర్ అంతకుముందు సూచించారు. నీటిపారుదల మంత్రి టి హరీశ్ రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సచివాలయంలో చెరువుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.
తెలంగాణలో 265 టిఎంసిల నీటిని నిల్వ చేసే సామర్థ్యం చెరువులకు ఉండేదని, సీమాంధ్రుల పాలనలో అవన్నీ నిర్లక్ష్యానికి గురికావడం వల్ల కేటాయించిన నదీ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ ద్వారా కేటాయించిన నీటిని పూర్తిగా వాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
కార్యక్రమాన్ని పారదర్శకంగా, ప్రణాళికబద్ధంగా నిర్వహించాలన్నారు. మొదటి దశలో 9వేల చెరువుల పునరుద్ధరణకు రూ.4.5 వేల కోట్లు కేటాయించామని, ఈ పనులను డిసెంబర్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదటి దశలో పునరుద్ధరించిన చెరువులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి సామర్థ్యంతో నిండి ఖరీఫ్‌లో ఆయకట్టు పూర్తిగా సాగులోకి రావాలని సూచించారు.
చెరువుల పునరుద్ధరణ పనులకు టెండర్లు పిలిచి, ఇ-ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని అవలంభించాలని కేసీఆర్ ఆదేశించారు. నామినేషన్ విధానంపై పనులు అప్పగించవద్దన్నారు. చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తే వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
టెండర్లు పిలిచే అధికారాన్ని నిధుల వ్యయాన్ని బట్టి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు రూ.50 లక్షలు, సూపరింటెండెంట్ ఇంజనీర్లకు కోటి రూపాయలు, చీఫ్ ఇంజనీర్లకు కోటికి పైబడిన వాటిని అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ పనులు పెద్దఎత్తున చేపడుతుండటంతో చిన్ననీటి వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాల్సిందిగా మంత్రి హరీశ్ రావును ఆదేశించారు.
గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలకు వేర్వేరుగా చీఫ్ ఇంజనీర్లను నియమించడంతోపాటు, జిల్లాకో ఎస్‌ఇ, రెండు, మూడు నియోజకవర్గాలకు కలిపి ఒక ఇఇ, నియోజకవర్గానికి ఒక డిఇ, మండలానికి ఒక ఎఇని నియమించాల్సిందిగా ఆదేశించారు. సర్వే పనులకు అవసరమైన యంత్ర పరికరాలు, లాప్‌ట్యాప్‌ల కొనుగోలుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో కనీసం ఒక్క చెరువును మినీ ట్యాంకు బండ్‌గా మార్చాలని, అందులో నీళ్లుంటే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.
చెరువు ఊరిబరువు మోసే వనరు కాబట్టి వాటి పునరుద్ధరణ వల్ల జరిగే ప్రయోజనాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చెరువుల పునరుద్ధరణ ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా అదొక ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చి చెరువులను దత్తత తీసుకోవాలని, ముందుకు వచ్చే వారి పేర్లను వాటికి పెడుతామన్నారు.
సమాధానముంది: దేవినేని
ఆంధ్రప్రదేశ్‌కు జీవోలు పంపిస్తామన్న తెలంగాణ రాష్ట్ర మంత్రుల వ్యాఖ్యల పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన జీవో 233కు తమ వద్ద సమధానం ఉందని దేవినేని సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications