ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ మంతనాలు.. ఏపీ రాజకీయాలపై సర్వే?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించలేవని, ఇప్పటికే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తున్నారని, మరోసారి కేంద్రంలో పగ్గాలు చేపడితే ప్రజాస్వామ్యానికే విఘాతం కలుగుతుందని కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా అన్ని విపక్షాలను ఒక్కచోటకు చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దసరారోజు జాతీయ పార్టీ ప్రకటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

విజయవాడ సభలో ప్రసంగం
జాతీయ పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంకన్నా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకవేదిక మీదకు తీసుకురావడమే సబబుగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఏపీ రాజకీయాల పరిస్థితి ఏమిటి? అని అంచనా వేసేందుకు కేసీఆర్ కు ఒక అవకాశం లభించింది. అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో ఒకరోజు పాల్గొననున్నారు. ఆ సందర్భంగా ఆయన బహిరంగసభలో ప్రసంగించనున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి మోడీతో కలిసి కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత 2019, జూన్ 17న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎంని ఆహ్వానించేందుకు విజయవాడ వచ్చారు. అప్పుడే ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాతే ఆయన విజయవాడలో రాజకీయాలపై మాట్లాడబోతున్నారు.

ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు
ఈలోగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ మంతనాలు సాగించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఏమిటి? ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ జనసేన, బీజేపీ కాకుండా రాజకీయానికి రెండోవైపు పరిస్థితి ఏమిటి అనేది తనకు కావాలన్నారు. ఈమేరకు పీకే సర్వే చేశారు. ఇతర విషయాలేవీ వెల్లడి కానప్పటికీ ఒక ప్రధానమైన అంశం మాత్రం వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ శూన్యత ఉందని ప్రశాంత్ కిషోర్ సర్వే వెల్లడించింది.

విజయదశమిరోజు స్పష్టత?
ఈ శూన్యతను ఒకవేళ జాతీయ పార్టీ ప్రకటిస్తే దాంతో భర్తీచేసే అవకాశం ఉందా? అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలో రాజకీయ శూన్యత ఉండటానికి కారణం ఏమిటి? రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడిగా ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను భావిస్తారు. ఇటువంటి సమయంలో అక్కడి ప్రజలను పార్టీద్వారా ఒప్పించగలుగుతారా? ఇతర పార్టీలను వేదికగా చేసుకుంటారా? కులం ఆధారంగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో శూన్యతను భర్తీచేయడానికి ప్రత్యేక ప్రణాళికలేమైనా రచిస్తున్నారా? అనేది విజయదశమిరోజు తేలిపోనుంది.












Click it and Unblock the Notifications