కేసీఆర్ శుభవార్త, ఓయులో భగ్గు: టీఆర్ఎస్‌దీ తప్పేనంటూ రేవంత్‌పై జానా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. జూలైలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించామన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చెప్పారు. సంక్షేమ పథకాలకు రూ.28వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు.
ఆర్టీసి కార్మికులకు 44 శాతం, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. చెరువులకు పునర్వైభవం తీసుకు వస్తామని చెప్పారు. రూ.35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలు, రూ.30వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపడతామన్నారు. ఐదు లక్షల నాలుగువేల కోట్లతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గురించి పాఠ్యపుస్తకాలలో లేకపోవడం దారుణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏడాది తెరాస పాలనలో ఎవరు కూడా సంతోషంగా లేరని చెప్పారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జానా
ఎమ్మెల్యేల ఫిరాయింపులు, డీల్‌ల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అశహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయన్నారు. రేవంత్ తన పేరును ఉచ్చరించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. తాను ఎప్పుడు నీతిమాలిన పనులు చేయలేదు, చేయనని అన్నారు. అధికారం కోసం ఒకరు, లాక్కునేందుకు ఒకరు రెండు తప్పే అన్నారు.
రేవంత్ రెడ్డిది నీతిమాలన చర్య అని షబ్బీర్ అలీ అన్నారు. తెరాస, టీడీపీ చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు మంత్రిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నైతికత పైన టీడీపీ, తెరాసలకు మాట్లాడే హక్కు లేదన్నారు.
ఆవిర్భావ వేళ విద్యార్థుల ర్యాలీ, ఓయులో ఉద్రిక్తత
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఓయూ భూములను తీసుకుంటానన్న వ్యాఖ్యలపై విద్యార్థి లోకం భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యంతో సర్కార్ పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.












Click it and Unblock the Notifications