కెసిఆర్ ప్రభుత్వం షాక్: ఎపీఎన్జీవోల భూములు వెనక్కి?
హైదరాబాద్: హైదరాబాద్, దాని శివారులోని భూముల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరో అడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎపిఎన్జీవోలకు షాక్ ఇచ్చే దిశగా ప్రభుత్వం కదులుతోంది. హైదరాబాద్నగర శివారులోని గోపనపల్లిలో ఎపీఎన్జీవో హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ మేరకు రెవెన్యూశాఖకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో 23 జిల్లాలకు సంబంధించి రాజధానిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు గచ్చిబౌలి స్టేడియం వెనుక సర్వే నెం 36,37 లో 477 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది.

అయితే ఎవరెవరికి కేటాయించాలనే దానిపై వివాదాలు రావడంతో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు, హైకోర్టు ఎంప్లాయిస్, సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అనే నాలుగు అసోసియేషన్లు కలిపి ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2003-04లో నాలుగు సంఘాలకు కలిపి ఏర్పడ్డ అసోసియేషన్‌కు భూమిని కేటాయించింది. ఈ క్రమంలో ఏపీఎన్జీవోల సంఘానికి 189 ఎకరాల 11 గుంటల భూమి కేటాయించారు.
తమకు కేటాయించిన భూమిలో పలువురు ఉద్యోగులు ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భూములను వెనక్కి తీసుకోవాలన్న తెరాస ప్రభుత్వ నిర్ణయంపై ఏపీఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కక్ష్య సాధింపు చర్య అని, అవసరమైతే కోర్టుకు వెళతామని ఏపీఎన్జీవోలు అంటున్నారు.












Click it and Unblock the Notifications