ఢిల్లీలోని ప్రగతి స్థాయికి 'ఎగ్జిబిషన్' ఎదగాలి: కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఢిల్లీ ప్రగతి మైదాన్ స్థాయికి ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. ఆదివారం తార్నాకలో ఏర్పాటు చేసిన సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సొసైటీ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. నిబద్ధత గల వ్యక్తు కారణంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ దినదినప్రవర్ధమానంగా ఎదుగుతోందని ఆయన అన్నారు.

ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. నిజాం రాజ్యంలో ఈ సొసైటీకి పబ్లిక్ గార్డెన్‌లో చిన్న స్థలం ఉండేదన్నారు. అనంతరకాలంలో నిజాం దానిని ఎగ్జిబిషన్ మైదానంకు మార్చారని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సొసైటీ అక్కడే కొనసాగుతోందన్నారు.
సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధునాతన పద్ధతిలో విద్యార్థులకు ఫార్మసీ విద్యను అందిస్తోందన్నారు. కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తులే సొసైటీకి మార్దదర్శకులుగా ఉన్నారన్నారు. సొసైటీ కమిట్‌మెంట్‌కు ఈ కళాశాల భవంతి ప్రతీక అన్నారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఎగ్జిబిషన్ మించే స్థాయిలో మన ఎగ్జిబిషన్ సొసైటీని అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications