చెప్తే వినట్లేదు: కేసీఆర్‌పై బాబు, వరి వేయవద్దని సీఎం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జలాల బోర్డు తాగు, సాగునీరుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పిందన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం నీటి విషయంలో పద్ధతి ప్రకారం వెళ్దామని కేసీఆర్‌తో తాను చెప్పానని చంద్రబాబు అన్నారు. ఆయన ప్రతీది వివాదం చేస్తున్నారన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి కూడా 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని చెప్పినా కేసీఆర్ వినలేదన్నారు.

ఇద్దరం కూర్చొని చర్చించుకొని అధికారులతో ఈ విధానాన్ని అమలు చేయిద్దామని, దీని వల్ల ప్రయోజనం లేకపోతే పెద్ద మనుషులను పెట్టుకొని చట్ట ప్రకారం నడుచుకుందామని చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. కేసీఆర్ ఇవన్నీ పట్టించుకోవడం లేదన్నారు.
నేడు ఛత్తీస్‌గఢ్‌కు సీఎం
ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగా వాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు. ఆదివారం ఉదయం నగరంలోని మల్కాజిగిరి ప్రాంతం నేరేడ్‌మెట్ డిఫెన్స్ కాలనీలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం కేసీఆర్ చత్తీస్‌గఢ్ బయలుదేరి వెళ్తారు.
విద్యుత్తు కొనుగోలుపై ఆదివారం అక్కడి ప్రభుత్వ పెద్దలు, అధికారులతో చర్చలు జరుపుతారు. సోమవారం విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకొని, తిరిగి రాష్ట్రానికి వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నందున రబీలో రైతులు వరిపంట వేయకుండా సహకరించాలని ముఖ్యమంత్రి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం సాయంత్రం సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు కొరత ఉన్నందున రైతులు రబీలో వరి పంట వేయకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని సీఎం కోరారు.












Click it and Unblock the Notifications