Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చానెళ్ల బ్యాన్: ఆందోళనతో ఒత్తిడి, కెసిఆర్ 'సీతయ్యే'

హైదరాబాద్: సీతయ్య ఎవరి మాటా వినడన్నట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 చానెళ్ల ప్రసారాల నిలిపివేత విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, చానెళ్ల ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్‌వోలకు సెల్యూట్ చేయాలని ఆయన వరంగల్‌లో జరిగిన కాళోజీ శతజయంతి కార్యక్రమంలో అన్నారు. దీన్నిబట్టి ఆయన వెనక్కి తగ్గడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరని అర్థమవుతోంది.

ఎంఎస్‌లో వెనక అదృశ్య హస్తం ఉందని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించే పరోక్షంగా ఆ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. ఆ బలమే లేకపోతే ఎంఎస్ఓలు అంత సాహసానికి ఒడిగట్టరనేది ఆయన మాటల్లోని అంతరార్థం. కాగా, బిజెపి నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్, జి. కిషన్ రెడ్డి కెసిఆర్ తీరు పట్ల తీవ్ర విమర్సలు చేస్తున్నారు.

తాజాగా, తన జర్నలిస్టుల ఆందోళనల ద్వారా ద్వారా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి కెసిఆర్‌పై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారంనాడు వరంగల్‌లో కెసిఆర్ వద్ద, హైదరాబాదులో ఐటి శాఖ మంత్రి, కెసిఆర్ తనయుడు కెటి రామారావు వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులు తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్ తలుపు కూడా తట్టారు. దానికితోడు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఒత్తిడికి కూడా తలొగ్గబోననే విషయాన్ని చాలా కచ్చితంగానే పరోక్షంగా కెసిఆర్ వరంగల్ సభలో చెప్పారు. ఆ రెండు చానెళ్లపై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

KCR

తెలంగాణలో చానళ్లు బతకదలిస్తే తెలంగాణకు సెల్యూట్‌ చేయాలని, తెలంగాణ సమాజాన్ని గౌరవించాలని తెలంగాణ కెసిఆర్ చానళ్ల ప్రసారాలు నిలిపివేసిన ఎంఎస్‌ఓలకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. ప్రజావ్యతిరేక చానళ్లను ప్రసారం చేయబోమని ఎంఎస్‌ఓలు బంద్‌ చేశారని, దీన్ని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ, ఇక్కడ డ్రామా అడుతున్నారని కెసిఆర్ విమర్శించారు. తెలంగాణలోని జర్నలిస్టులకు ఆయన హితబోధ కూడా చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే విధానాలను అనుసరించవద్దనే రీతిలో ఆయన జర్నలిస్టులకు సూచించారు.

పత్రికలకు స్వేచ్ఛ ఉండాలి గానీ...

పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని, అయితే, అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని కెసిఆర్ అన్నారు.. అప్పుడే మీడియాకు మర్యాద దొరుకుతుందన్నారు. ఆ రెండు చానళ్లు మళ్లీ తప్పు చేశాయన్నారు. వారు తనకు వ్యతిరేక వార్తలు రాయడం లేదని, తనకు వ్యతిరేకంగా రాస్తే తాను పట్టించుకోబోనని, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఆయన లాజిక్ లాగారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులను, తెలంగాణ శాసన సభను పాచిమొహాలు, టూరింగ్ టాకీస్ సినిమాలు చూసే వాళ్లను మల్టీప్లెక్సులో కూర్చుండబెట్టినట్లుగా ఉందని చెబితే ఊరుకోవాలా అన్నారు. ఇదేనా మీడియాకు ఉన్న స్వేచ్ఛ, సంస్కారం అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని ప్రసారం చేస్తే చానళ్లను కిలోమీటర్ల మేర పాతరేస్తామన్నారు. కెసిఆర్‌ను తిడితే ఇబ్బంది లేదని, కానీ తెలంగాణ శాసన సభను కించపరిస్తే ఎలా ఊరుకుంటామన్నారు. చానళ్లపై చర్యలు తీసుకోవాలని నాడు శాసన సభనే తీర్మానం చేసిందన్నారు. ఈ విషయాలన్నీ తెలంగాణలోని జర్నలిస్టులు ఆలోచించాలని ఆయన అన్నారు.

వరంగల్‌ జిల్లాలోని కాళోజీ శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన తన వద్ద నిరసన తెలపడానికి జర్నలిస్టు రావడంపై ఆయన ఆ విధంగా స్పందించారు. పోలీసులు జర్నలిస్టులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారిని ఏమీ అనవద్దని కెసిఆర్ తన ప్రసంగం మధ్యలో సూచించారు.

చానెళ్ల బ్యాన్ వెనక అదృశ్యం హస్తం

తెలంగాణాలో రెండు టెలివిజన్‌ చానళ్ల ప్రసారాల నిలిపివేత వెనుక అదృశ్య హస్తం ఉందని సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తమ వెనుక ఎవరూ లేకుంటే ఎంఎస్‌ఓలు ఇలా రెండు ముఖ్యమైన చానళ్ల ప్రసారాలను నిలిపివేసేవారు కాదని ఆయన అన్నారు. అసలు రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేసే శక్తి ఎంఎస్‌ఏలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు ఎందుకు వస్తాయంటే ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోకుంటేనే వస్తాయని ఆయన అన్నారు. తెలంగాణాలో రెండు చానళ్ల ప్రసారాల నిలిపివేత విషయంలో ప్రభుత్వ మౌనమే ఎంఎస్‌ఏలకు బలాన్ని ఇస్తున్నదని ఆయన అన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకుని ఆ రెండు చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించడానికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+