''ఏపీలో వారిద్దరూ నాతో ఉంటే.. మిగతా ఆట ఎలా ఆడాలో నేను చూపిస్తా..?''
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చుకొని భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణకన్నా ఏపీలోనే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలపై పూర్తిస్థాయి ఆసక్తి కలిగిన ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల కేసీఆర్ లక్ష్యం ఏమిటి? బీజేపీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మనల్ని తిట్టిపోసిన కేసీఆర్ ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తారు? అనే విషయాలపైనే మాట్లాడుకుంటున్నారు.

కులం మీద ఆధారపడ్డ ఏపీ రాజకీయాలు!
ఏపీలో రాజకీయాలన్నీ కులాన్ని ఆధారంగా చేసుకొని నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ నేర్చుకొని టెక్ నిపుణులైన తరుణంలో.. తమ ప్రతిభతో ప్రపంచంలోని అన్ని దేశాలకున్న సరిహద్దులను చెరిపివేసి కుగ్రామంగా మార్చిన తరుణంలో కూడా ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీలో పాగా వేయడానికి సరిగ్గా ఈ అంశాన్నే ఆధారం చేసుకోబోతున్నారు. అంటే హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఆంధ్రులు దాన్ని కోల్పోవడంతోపాటు మరోసారి తమ జుట్టును కేసీఆర్ చేతిలో పెట్టబోతున్నారని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న మేధావులు అంచనా వేస్తున్నారు.

కేసీఆర్ టార్గెట్ వీరే!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ కులాల్ని ఆధారంగా చేసుకొనే గేమ్ ఆడారు. సరిగ్గా ఇదే గేమ్ ను మరోసారి కేసీఆర్ ప్లే చేయబోతున్నారు. రాయలసీమ వాసులకు హైదరాబాద్ తో సాన్నిహిత్యం ఎక్కువ. తన మొదటి టార్గెట్ గా కేసీఆర్ వీరిని ఎంపిక చేసుకున్నారు. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని వెలమలు తనకు అనుకూలంగా ఉంటే చాలు.. మిగతా ఆట ఎలా ఆడాలో తాను చూస్తానని కేసీఆర్ తన ఆంతరంగికులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఆరు శాతం ఓట్లే ప్రధానం!
జాతీయ పార్టీగా గుర్తింపుతోపాటు కారు గుర్తు పోకుండా ఉండాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరుశాతం ఓట్లు సాధించాలి. దీన్ని గురించి కేసీఆర్ కు తెలుసు. అన్నీ పక్కాగా లెక్క వేసుకున్న తర్వాతే రంగంలోకి దిగారు. తన సొంత సామాజికవర్గం కాబట్టి వెలమలు తనతోపాటు వస్తారనే ధీమా కేసీఆర్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు.. టీడీపీలో అసంతృప్తితో ఉండేవారు.. రెడ్డి సామాజికవర్గంలో అసంతృప్తులు.. ఇలా పలురూపాల్లో సామాజికవర్గాలవారీగా కేసీఆర్ ప్రణాళిక రచించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తాను అనుకున్నస్థాయిలో ఓట్లు పొందగలిగితే చాలు అనే యోచనలో కేసీఆర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications