కెసిఆర్ ఆరా: బిజెపితో కలిసి తెలంగాణలో టిడిపి ప్లాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణలో కాంగ్రెసు, బిజెపి బలాలపై ఆరా తీస్తున్నారు. తనను కలుస్తున్న నాయకుల నుంచి ఆయన సమాచారం సేకరిస్తున్నారు. అలాగే, కొంత మందికి ఆయన స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బిజెపి తెలంగాణలో ఏ మేరకు లాభపడే అవకాశం ఉందనే విషయంపైనే కాకుండా తెలంగాణ ఇవ్వడం ద్వారా కాంగ్రెసు ఏ మేరకు మద్దతును పొందగలుతుందనే విషయంపై కూడా ఆయన సమాచారం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని గతంలో కెసిఆర్ కాంగ్రెసు పెద్దలకు హామీ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, సాధించిన తెలంగాణను కాంగ్రెసు నేతల చేతుల్లో పెడితే అభివృద్ధి జరగదని, అధికారం కోసం పోటీ పడడంలోనే కాంగ్రెసు నాయకులు కాలం వెల్లబుచ్చుతారని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్ వ్యూహంలో మరో ఎత్తుగడ కూడా ఉంది. కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తే తెలుగుదేశం పార్టీని మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి చాటుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు, తెరాస మధ్య పోటీ ఉంటే తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి వెళ్లిపోతుందని, తద్వారా టిడిపిని తెలంగాణలో లేకుండా చేయవచ్చునని ఆయన అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, కాంగ్రెసు, తెరాసలను ఎదుర్కోవడానికి తెలుగుదేశం వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసులో తెరాస విలీనం జరిగితేనే తమకు లాభమనే ఉద్దేశంతో తెలుగుదేశం తెలంగాణ నేతలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం కావడానికి కెసిఆర్‌ను నిందించే పని పెట్టుకున్నారు. తెరాసను విలీనం చేస్తే వెంటనే తెలంగాణ వస్తుందని వారు చెబుతున్నారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేసే విషయంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, రాజకీయాలు ముఖ్యమో తెలంగాణ ముఖ్యమో తేల్చుకోవాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం కెసిఆర్‌కు సలహా ఇచ్చారు.
కాంగ్రెసు పార్టీని విలీనం చేయడానికి కెసిఆర్ విముఖత ప్రదర్శిస్తుండడం వల్లనే తెలంగాణ వెనక్కి పోతోందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఇంతకు ముందు అన్నారు. కాంగ్రెసు, తెరాస రెండు కలిసిపోతే, తమకు తెలంగాణలో బలం ఉంటుందని, తాము శక్తిగా నిలబపడడానికి వీలవుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దానికితోడు, బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలో కాంగ్రెసు, తెరాస కూటమిని ఎదుర్కోవడం సులభం అవుతుందని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, పొత్తు బిజెపికి ఎంత అవసరమో, తమకూ అంతే అవసరమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారని చెబుతున్నారు. తెలంగాణ క్రెడిట్ ఏదో మేరకు బిజెపికి దక్కుతుందని, దాంతో పాటు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రజాకర్షణ కూడా తమకు కలిసి వస్తుందని తెలంగాణ తెలుగుదేశం నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, తెలంగాణలో ముఖాముఖి పోటీకి రంగం సిద్ధం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications