ఇళ్ల పథకంలో కోట్ల స్కామ్: సిఐడికి కెసిఆర్ అప్పగింత
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భారీ కుంభకోణం జరిగినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం గుర్తించింది. ఈ కుంభకోణంపై విచారణను కెసిఆర్ సిఐడికి అప్పగించారు. రెండు మూడు రోజుల్లో సిఐడి విచారణ ప్రారంభం కానుందని సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తాకథాన్ని ఓ తెలుగు టీవీ చానెల్ బుధవారం ప్రసారం చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన నివేదిక తమ వద్ద ఉందని కూడా చెప్పుకుంది.
ఆ టీవీ చానెల్ వార్తాకథనం ప్రకారం - ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 523.6 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. థర్ట్ పార్టీ వెరిఫికేషన్‌లో ఈ కుంభకోణం బయటపడింది. తెలంగాణలోని 9 జిల్లాల్లోని 245 మండలాల్లో గల 625 గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 593 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు జరిగినట్లు సర్వేలో బయటపడింది. 2 లక్షల 11 వేల 290 ఇళ్లపై సర్వే జరిగింది. 26 వేల 128 ఇళ్ల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.

కొన్ని ఇళ్లకు రెండుసార్లు చెల్లింపులు చేశారని, లేని ఇళ్లకు కూడా చెల్లింపులు చేశారని, పాత ఇళ్లకు కూడా చెల్లింపులు చేశారని సర్వేలో తేలింది. 1623 ఇళ్లకు రెండు సార్లు చెల్లింపులు జరిపారు. లేని 4,375 ఇళ్లకు చెల్లింపులు జరిపారు. 1568 పాత ఇళ్లకు చెల్లింపులు జరిపినట్లు గుర్తించారు.
ఈ కుంభకోణంలో ఎఈల నుంచి ఎమ్మార్వో, ఎండివోల వరకు పాలు పంచుకున్నట్లు గుర్తించారు. దాదాపు 500 మంది ప్రమేయ ఈ కుంభకోణంలో ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు అధికారులను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు, మరికొంత మందిని డిస్మిస్ చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications