రేవంత్ రెడ్డి ఆస్తులపై ఆరా: కెసిఆర్ ఆదేశాలు
హైదరాబాద్: తనపై, తన ప్రభుత్వంపై ఏకధాటిగా విమర్శలు చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆస్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రేవంత్‌రెడ్డికి ఉన్న ఆస్తులపై సమాచారం సేకరించాలని ప్రభుత్వం తహశీల్దారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమంత్రిపై అనుచిత విమర్శలు చేశారంటూ రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కేసులు కూడా పెట్టారు. తాజాగా ఆయన ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కెసిఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అనేక చోట్ల అసెంబ్లీలోగానీ, బయటగానీ రేవంత్ చేస్తున్న కార్యక్రమాలు కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో రేవంత్‌రెడ్డిని, టిడిపి ఎమ్మెల్యేలను ప్రభుత్వం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తనపై కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సర్కార్ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విషయంలో వెనకాడబోనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై టీటీడీపీ వర్గాలు కొంత ఆందోళనలో ఉన్నప్పటికీ ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఎదుర్కొంటానని చెపుతున్నారు. వైఎస్ ప్రభుత్వం కూడా టీడీపీ నేతల ఆస్తులను లక్ష్యం చేసుకుందని, ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఆదే ధోరణిలో వ్యవహరిస్తోందని, దీనిని ఎదుర్కొంటామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నట్లు మీడియా వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications